ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ రాష్ట్రంలో అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 15న విజయవాడలో చేపట్టనున్న బహిరంగ సభను జయప్రదం చేద్దామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్ పిలుపునిచ్చారు. శుక్రవారం గణేనాయక్ భవన్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 8 పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం పునర్విభజన జరిగి పది సంవత్సరాలు పూర్తవుతున్నా ప్రాంతాల వెనుకబాటు, సామాజిక అసమానతలు కొనసాగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వ అన్యాయం, అసమాన అభివృద్ధి-జగన్ ప్రభుత్వ విధానాలు, ధరలు ప్రజలపై భారాలు, విద్యుత్ సంస్కరణలు, పట్టణ సంస్కరణలు భారాలు, మహిళలపై హింస, ఉమ్మడి పౌరసృతి అర్‌ఎస్‌ఎస్ అజెండా, విద్యారంగ ప్రయివేటీకరణ విధానాలు అనే అంశాలపై పుస్తకాలు ముద్రించినట్లు తెలిపారు. ఈ పుస్తకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వినాశకర విధానాలను వివరించనున్నట్లు తెలిపారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజి, రాష్ట్రానికి హోదా కేంద్రం అమలు చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని సాధించడంలో విఫలమైందన్నారు. కృష్ణాజలాల పున్ణపంపిణీ, అప్పర్‌భÛద్రా నిర్మాణం వల్ల రాయలసీమ నీటి జలాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వంలో సరైన చలనం లేదన్నారు. విభజన చట్టంలో భాగంగా రాష్ట్రంలో నిర్మించాల్సిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒక్కటి పూర్తి కాలేదన్నారు. వైసిపి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయిందన్నారు. విద్యా, వైద్యరంగాలు పూర్తిగా ప్రయివేటీకరణ అవుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విద్యుత్ సంస్కరణలను వైసిపి ప్రభుత్వం బలపరచడమే కాకుండా దేశంలోనే అందరికంటే ముందుగా అమలు చేసి మోడీ ప్రసన్నం పొందడానికి ప్రయత్నిస్తోందన్నారు. పట్టణ సంస్కరణల వల్ల ఆస్థి పన్ను, చెత్తపన్ను పెరిగాయన్నారు. అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ఉద్యమిస్తోందని అందులో భాగంగా విజయవాడలో ఈనెల 15న భారీ బహింరగసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఓ.నల్లప్ప, ఎం.బాలరంగయ్య, ఎస్.నాగేంద్రకుమార్, జిల్లా కమిటీ సభ్యులు ఆర్.చంద్రశేఖర్రెడ్డి, వి.రామిరెడ్డి, ఎస్.ముష్కిన్, వై.వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.