అనంతపురం కలెక్టరేట్ : రాష్ట్రంలో అసమానతలు లేని అభివృద్ధి జరగాలని, అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15వ తేదీన సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్ పిలుపునిచ్చారు. మంగళవారం నాడు అనంతపురం నీలిమా సర్కిల్ చలో విజయవాడ పోస్టర్‌లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి పదేళ్లు పూర్తైనా అభివృద్ధి మాత్రం అడుగు ముందుకు పడలేదన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, కడప ఉక్కు పరిశ్రమ, రాజధాని నిర్మాణం, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు, రైల్వే జోన్ వంటి విభజన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయని బిజెపిని నిలదీయాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం దాసోహం అయ్యిందన్నారు. కోట్లాది మంది కార్మికుల హక్కులను కాలరాసే లేబర్ కోడ్‌లను తెచ్చిందన్నారు. దేశీయ వ్యవసాయానికి, ప్రజల ఆహార భద్రతకు ముప్పు తెచ్చే నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చిందన్నారు. విద్యా, వైద్యాన్ని పూర్తిగా ప్రయివేటీకరిస్తోందన్నారు. వీటన్నింటినీ పార్లమెంట్‌లో వైఎస్‌ఆర్‌సిపి, టిడిపిలు ప్రత్యక్షంగా, పరోక్షంగా బలపరుస్తున్నాయని తెలిపారు. వైసిపి ప్రభుత్వ విద్యా విధానంతో ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయని తెలిపారు. లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షన్ విషయంలో ఇచ్చిన హామిని తుంగలో తొక్కి జిపిఎస్ పేరుతో మోసం చేసిందన్నారు. అంగన్‌వాడీలు, ఆశాలు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలన్నీ గాలికెగిరిపోయాయని విమర్శించారు. నిరసనలు తెలిపే స్వేచ్చను కూడా వైసిపి ప్రభుత్వం హరిస్తోందన్నారు. అనంతపురం జిల్లా వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో దశాబ్దాలుగా వెనుకబడిందన్నారు. సాగునీరు కల్పించడంలోనూ, కరువు సహాయక చర్యలు ప్రకటించడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. జిల్లాలో ఒక్క కొత్త పరిశ్రమ స్థాపించలేదన్నారు. ప్రభుత్వ విద్య, వైద్యం బలహీనపరిచి కార్పొరేట్ విద్య, వైద్యాన్ని పెద్ద ఎత్తున పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. ఈ సమస్యలపై 15న విజయవాడలో నిర్వహించే బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి, జిల్లా కమిటి సభ్యులు ఎస్.ముస్కిన్, వై.వెంకటనారాయణ, నాయకులు వలి, ప్రకాష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.