Aug 15,2023 22:32

గోవిందరావుకు నోటీసులు అందజేస్తున్న పోలీసులు

* సిపిఎం, సిఐటియు నాయకులకు పోలీసుల నోటీసులు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌  : 
విద్యుత్‌ ఉద్యోగులకు మెరుగైన వేతన ఒప్పందం చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యుత్‌ ఉద్యోగుల జెఎసి ఆధ్వర్యాన ఈనెల 17వ తేదీన చేపడుతున్న 'చలో విజయవాడ'కు వెళ్లొద్దని సిపిఎం, సిఐటియు నాయకులు పోలీసులు మంగళవారం నోటీసులు ఇచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని పేర్కొంటూ యు/ఎస్‌ 149 సిఆర్‌పిసి 1973 నోటీసును శ్రీకాకుళంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, టెక్కలిలో సిఐటియు నాయకులు నంబూరు షణ్ముఖరావుకు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఉద్యోగులతో చర్చించి మెరుగైన పిఆర్‌సి ఇవ్వకుండా, అందుకోసం ఉద్యమిస్తున్న నాయకులకు నోటీసులు జారీ చేయడం సరికాదన్నారు. నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరన్నారు. ఉద్యమాలపై నిర్బంధాలు ప్రయోగిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. విద్యుత్‌ ఉద్యోగులకు మెరుగైన పిఆర్‌సి ఇవ్వాలని, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ఉద్యోగుల పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు.