
ప్రజాశక్తి - బెలగాం : అసమానతల్లేని రాష్ట్రం, జిల్లా అభివృద్ధి కోసం జరిగే సిపిఎం ప్రజారక్షణభేరి ముగింపు బహిరంగ సభ ఈనెల 15న విజయవాడలో జరగనుందని, దీనికి ప్రజలంతా తరలిరావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్వతీపురం పట్టణంలో బైకు ర్యాలీ స్థానిక సుందరయ్య భవనం నుంచి ప్రారంభమై కాంప్లెక్స్ మీదుగా నాలుగు రోడ్ల జంక్షన్, రాయగడ రోడ్డు, మార్కెట్ యార్డు మీదుగా బైపాస్ రోడ్డు, బంధం వారి వీధి, పద్మశ్రీ థియేటర్ మీదుగా కలెక్టర్ ఆఫీసు వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా ప్రజా సమస్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని, లౌకిక, ప్రజాస్వామ్య, ప్రజాతంత్ర హక్కుల పరిరక్షణ, అసమానతల్లేని సమగ్ర అభివృద్ధికి, రాష్ట్రానికి ప్రత్యేక హౌదా ఇవ్వకుండా ద్రోహం చేసిన బిజెపి విధానాల్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సిపిఎం ప్రజా రక్షణ బేరి యాత్రలో భాగంగా ఈనెల 15న విజయవాడలో జరిగే బహిరంగ సభ కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొంటారని తెలిపారు. కావున అన్ని తరగతుల ప్రజలు విజయవాడకు వెళ్లేందుకు మంగళవారం చలోకి తరలి రావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.ఇందిర, వై.మన్మధరావు, జిల్లా కమిటీ సభ్యులు జి.వెంకటరమణ, కె.రామస్వామి, పట్టణ కమిటీ సభ్యులు బంకురు సూరిబాబు, ఎస్.ఉమా, పాకల సన్యాసిరావు, శంకర్రావు. వి.చిన్నంనాయుడు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సాలూరు: ఈనెల 15న విజయవాడలో సిపిఎం ఆధ్వర్యాన నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ స్థానిక సిపిఎం నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని రాజేశ్వరరావు పార్కు నుంచి ర్యాలీని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎన్నై నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం చేపట్టిన ప్రజారక్షణ భేరి యాత్ర ముగించుకొని విజయవాడలో నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై అవగాహన కల్పించేందుకు యాత్ర నిర్వహించినట్లు తెలిపారు. కావున ఈ సభకు ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు టి.శంకర్, టి.ఇందు పాల్గొన్నారు.
సీతానగరం : ఈనెల 15న విజయవాడలో జరుగు ప్రజా పరిరక్షణభేరి, బహిరంగ సభలో ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం మండల కమిటీ పిలుపునిచ్చారు. ఈ మేరకు మండలంలోని పలు గ్రామాల్లో బైక్ ప్రసారం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి లక్ష్మనాయుడు, మండల కార్యదర్శి రెడ్డి ఈశ్వరరావు, మండల కమిటీ సభ్యులు జి.వెంకటరమణ, ఆర్.రాము, రెడ్డి రమణమూర్తి, సిహెచ్.కృష్ణ, వై.రామారావు, బి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.