Nov 10,2023 21:23

ప్రచారం చేస్తున్న చిన్నారులు

          ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   కష్టం, నష్టం తెలియదు.. కల్లాకపటం తెలియని పసిపిల్లలు.. తమ భవిష్యత్తు ఎలా ఉండాలో తెలియకుండానే 'అసమానతలు లేని అభివృద్ధి చేయాలనే నినాదంతో ఇంటింటా తిరిగి చలో విజయవాడ బహిరంగ సభను జయప్రదం' చేయాలంటూ చిట్టి పొట్టి మాటలతో మాట్లాడుతూ ఆకట్టుకున్నారు. ఈనెల 15న సిపిఎం ఆధ్వర్యంలో తలపెట్టిన చలో విజయవాడ బహిరంగ సభను విజయవంతం చేయాలని శుక్రవారం నగరంలోని శ్రీశ్రీ నగర్‌లో చిన్న పిల్లలు ఇంటింటికీ తిరిగి అవ్వా.. సభకు వెళ్లాలి సిద్ధం కావాలి.. తాతా.. సభకు రావాలి.. అంటూ బుడిబుడి అడుగులు వేస్తూ ప్రచారం చేశారు. ఇందుకు ఓ వృద్ధురాలు సైతం స్పందిస్తూ బోసి నవ్వులతో 'సభకు వెళ్తా.. ఛార్జీలకు డబ్బులు ఇవ్వు పెద్దయ్యా..' అంటూ చలోక్తులు విసిరింది. ఇలా పిల్లలు కాలనీలోని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. సమయం దొరికితే స్నేహితులతో ఆటలు ఆడుకుందామనుకునే పిల్లలు ఇలా సమాజిక అభివృద్ధితో ముడిపడిన అంశాలపై ప్రచారం చేయడంతో కాలనీవాసులు పిల్లలను అభినందించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు రోషిని, గగన్‌, గురుప్రసాద్‌, జయకృష్ణ, హేమసాగర్‌, అల్లాభి తదితరులు పాల్గొన్నారు.