Nov 05,2023 21:26

ఫొటో : కరపత్రాలు ఆవిష్కరిస్తున్న నాయకులు

'చలో విజయవాడ' జయప్రదానికి పిలుపు
ప్రజాశక్తి-ఉదయగిరి : చలో విజయవాడ నవంబర్‌ 15న జరిగే భారీ బహిరంగ సభకు కార్మిక సంఘం నాయకులు కార్యకర్తలు అభ్యుదయవాదులు అధిక సంఖ్యలో తరలిరావాలని సిపిఎం మండల కార్యదర్శి ఫర్థీన్‌ బాషా, రైతు సంఘ నాయకులు కాకు వెంకటయ్య కోరారు. ఆదివారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో వారు మాట్లాడుతూ ఛలో విజయవాడ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ప్రజా రక్షణ భేరి చలో విజయవాడ నవంబర్‌ 15న తరలి రావాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు.
దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మనలనందరినీ కలవరపరుస్తున్నాయని ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారని ఎదురు చూసే కన్నా మన బతుకులను, రాష్ట్ర భవిష్యత్తును సక్రమ మార్గాన నడిపించడానికి ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించే అవశికత వచ్చిందన్నారు. ఈ ఉద్యమంలో సిపిఎం ప్రజలతోపాటు ఉంటుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకట్ట వేసేందుకు చేపట్టే ఈ బహిరంగ సభను ప్రతి ఒక్కరూ నడుం బిగించి భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిటిసి కాకు విజయ, నాగరాజ్‌, నాయబ్‌, తదితర మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.