చలో పాల డెయిరీ చేపడతాం : సిఐటియు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
అక్రమంగా తొలగించిన విజయ పాల డెయిరీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో చలో పాల డెయిరీ కార్యక్రమాన్ని చేపడతామని సిఐఇయు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నాగరాజు తెలిపారు. నంద్యాలలోని కలెక్టర్ కార్యాలయం ముందు విజయ పాల డెయిరీలో అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని చేపట్టిన నిరాహార దీక్ష శనివారం 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలను సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరు నెలలుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా విజయ పాల డెయిరీ యాజమాన్యానికి, జిల్లా లేబర్ అధికారులకు, జిల్లా అధికారులకు ఏమాత్రం పట్టడం లేదన్నారు. గత 20 సంవత్సరాల నుండి పని చేసిన 9 మంది దళిత కార్మికులను యాజమాన్యం అకారణంగా అధికార దర్పంతో తొలగించి, కార్మిక చట్టాలను తుంగలో తొక్కిందన్నారు. కార్మిక హక్కులను కాల రాస్తున్న విజయ పాల డెయిరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలన్నారు. విజయ పాల డెయిరీ కార్మికులు గొంతెమ్మ కోరికలు ఏమి కోరడం లేదని, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిరాహార దీక్షలో కార్మికులు నాగరాజు, బాలసుబ్బయ్య, ప్రసాదు, ఇస్సాకు, శేఖర్, కరుణాకర్, కలందర్, రవిశంకర్ తదితరులు కూర్చున్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.మహమ్మద్ గౌస్, జిల్లా కార్యదర్శులు వెన్న బాల వెంకట్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.










