Apr 01,2023 21:19

eevaram Nandayala

చలో.. గళమెత్తేందుకు..
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి

      ఉద్యోగులు, కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులన్నింటిని మోడీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత కాలరాస్తూ కార్మిక చట్టాల్లో మార్పు తెచ్చింది. నాలుగు లేబర్‌ కోడ్లను తెచ్చి కార్పొరేట్‌ కంపెనీల్లో కార్మికులను బానిసలుగా మార్చడానికి పూనుకుంది. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్‌ చేతుల్లో పెడుతోంది. కనీస వేతనాల ప్రస్తావనే చేయడంలేదు. అసంఘటిత కార్మికుల సంక్షేమం ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. స్కీమ్‌ వర్కర్లతో వెట్టిచాకిరీ చేయిస్తోంది. బిజెపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కీలక రంగాలైన బ్యాంకులు, ఇన్సురెన్స్‌, టెలికాం, రైల్వే, పోస్టల్‌, పోర్టులు, విద్యుత్‌ సంస్థలతో సహా అన్నింటినీ ప్రైవేటీకరించి స్వదేశ, విదేశీ కంపెనీలకు స్వాధీనం చేయాలని నిర్ణయించింది. ప్రజల సంపద ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి పోతోంది. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌, స్కీం వర్కర్లు శాశ్వతమైన పని పద్ధతుల్లో నిత్యం పనుల్లోనే ఉన్నారు. వీరిని రెగ్యులరైజ్‌ చేయడం లేదు. ఈ రకంగా ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతుల సంఘా ఆధ్వర్యంలో ఈ నెల 5న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తేందుకు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లాలో సన్నాహక కార్యక్రమాలు చేపట్టారు. ప్రచార జాతాలు నిర్వహించారు.
మండుతున్న ఎండ : జిల్లాలో ఎండ మండుతోంది. మార్చి చివరి వారానికి భానుడి భగభగలు తీవ్రమయ్యాయి. జిల్లాలో వేసవి తీవ్రత పెరిగింది. గత వారం రోజుల నుంచి ఎండ తీవ్రరూపం దాల్చింది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడిమితో మధ్యాహ్నం నిప్పుల కొలిమిలా ఎండ తీవ్రత కనిపిస్తోంది. మే నెలాఖరు వరకు ఎండలు ఎంత భయంకరంగా ఉంటాయోనని జిల్లా వాసులు భయపడుతున్నారు. ఇప్పటికే ఎండ ధాటికి తట్టుకోలేక నగరంలో మధ్యాహ్నం పూట రోడ్ల మీద జన సంచారం పలుచబడింది. ఎండ వేడిమి నుంచి కాపాడుకోవడానికి జాగ్రత్తలు తప్పవని వైద్యులు సూచిస్తున్నారు.
జాదూ పరిహారంపై ఆందోళన : కావేరి జాదు నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. పత్తి రైతులు తమకు పరిహారం ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్‌ గేట్లను ఎక్కి వాటిని తెరుచుకునేందుకు ప్రయత్నించారు. కొంతసేపు రైతులకు పోలీసులకు మధ్య తోపులాట కొనసాగింది. కలెక్టర్‌ దిగివచ్చి తమకు న్యాయం చేసేంతవరకు ఈ ఆందోళన విరమించేది లేదని పత్తి రైతులు నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. వెంటనే రైతులను పోలీసులు నిలువరించి జిల్లా అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. అక్కడికి వ్యవసాయ శాఖ జెడి వరలక్ష్మి చేరుకొని ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ నుండి వినతి పత్రాన్ని స్వీకరించారు.
అవీ..ఇవీ..అన్నీ..
గుంటూరు బాపనయ్య 45వ వర్ధంతి సందర్భంగా పలు ప్రాంతాల్లో నివాళులర్పించారు. జిల్లా వ్యాప్తంగా టిడిపి 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. శ్రీరామ నవమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు, పోటీలు నిర్వహించారు.