Dec 31,2022 00:02

మాట్లాడుతున్న గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనరస

ప్రజాశక్తి పాడేరు:గిరిజనులకు నష్టాన్ని చేకూర్చే హైడ్రో పవర్‌ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గిరిజన సంఘం చేపట్టిన చింతపల్లి మండలం గొందిపాకల పంచాయతీ చలో ఎర్రవరం శుక్రవారం విజయవంతమైంది. వందలాది మంది గిరిజనులు భారీగా తరలి వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ జయప్రదమైంది.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి అప్పలనరస మాట్లాడుతూ, హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ అనుమతి రద్దు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి పోరాటాన్ని నిర్వహిస్తామన్నారు. గిరిజన జాతీయ కమిషన్‌ చట్టంలో పేర్కొన్న వాటిని కూడా ఉల్లంఘంచిన గిరిజన ద్రోహిగా మోడీ, జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వాలు మిగులుతాయన్నారు. చలో ఎర్రవరం సభను భగం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసినా విపలమయ్యాయన్నారు. బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్పించే చర్యను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కాపీ రైతులకు గిట్టు చెల్లించలేదని, సుమారు 60 కోట్ల బకాయి కూలి సొమ్ము ఇవ్వలేదన్నారు. కాపీ ప్రాజెక్ట్‌ నగదును నవరత్నాలకు దారి మళ్ళించారని విమర్శించారు. గిరిజన సహజ సంపదను దోపిడీ చేసే పాలకవర్గానికి వ్యతిరేకంగా జనవరి 20 తేదీన నిర్వహించే చలో కలెక్టరేట్‌ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ పేరుతో 15 వేల ఎకరాల అటవీ భూమిని ఆదాని కంపెనీకి అప్పగించే అధికారం జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి లేదన్నారు. గిరిజన ప్రాంతంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం చట్ట వ్యతిరేకమని, ఈ విషయాన్ని గుర్తించి గిరిజనుల పోరాటానికి అరకు, పాడేరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజాప్రతినిధులు మద్దతు ఇవ్వాలన్నారు.
హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ వ్యతిరేక కమిటీ కన్వీనర్‌ బోనంగి చిన్నయ్య పడాల్‌ మాట్లాడుతూ అనంతగిరి మండలం లో 5800 మెగా వాట్స్‌ విద్యుత్‌ ఉత్పత్తి నిమిత్తం పెదకోట, గుజ్జెలి, చిట్టంపాడుతో పాటు చింతపల్లి మండలంలో ఎర్రవరంలో కూడా హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయడమంటే గిరిజనులు జల సమాధి చేయడమే అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం అందించలేని ప్రభుత్వం హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ బాధితులను ఆదుకుంటామని, ఉపాధి కల్పిస్తామని మాయ మాటలు చెప్పడం దారుణమని తెలిపారు. పెదకొటలో హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి దొడ్డిదారిన సర్వే నిర్వహించారన్నారు. గుజ్జిలి, చిట్టెంపాడులో శాటిలైట్‌ సర్వే నిర్వహించారన్నారు. సర్వే కొచ్చే వారిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పి.లక్కు మాట్లాడుతూ గిరిజన హక్కులు చట్టాలు ఉల్లంఘించిన నరేంద్ర మోడి, జగన్మోహన్‌రెడ్డిలు ఆధాని కార్పొరేట్‌ సంస్థలకు గిరిజనుల భూములు కట్టబెటడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు
గొందిపాకల సర్పంచ్‌ సాగిన వరలక్ష్మీ మాట్లాడుతూ, హైడ్రో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సాగించే గిరిజనుల పోరాటానికి మద్దతుగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గొందిపాకల పంచాయతీ వైసీపీ ఎంపీటీసీ, చింతపల్లి సిపిఎం మండల కార్యదర్శి పాంగి ధనుంజరు, గిరిజన సంఘం మండల కార్యదర్శి చిరంజీవి, కొయ్యూరు మండల కార్యదర్శి ఎస్‌.సూరిబాబు, జీకే వీధి మండల కార్యదర్శి, దారకొండ ఎంపీటీసీ ఏ.బుజ్జిబాబు సత్యనారాయణ నాయుడు, ఎర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ వ్యతిరేక కమిటీ నాయకులు గుడెపు చిన్నారాజు, గోపాలకృష్ణ, రాజు, కృష్ణంరాజు, మంగరాజు, బాలన్న, పెద్దఎత్తున గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.