Mar 29,2023 21:17

నంద్యాలలో బైక్‌ ర్యాలీ చేపడుతున్న సిఐటియు నాయకులు

చలో ఢిల్లీని విజయవంతం చేయాలి
- నంద్యాలలో సిఐటియు ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ
- పోస్టర్లు విడుదల, జీపుజాతా, కరపత్రాల పంపిణీ
ప్రజాశక్తి - నంద్యాల

     కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ, రైతాంగ, వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ ఏప్రిల్‌ 5న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం నంద్యాల పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సిఐటియు కార్యాలయం నుండి ప్రారంభమై నూనెపల్లె, రైల్వే స్టేషన్‌, వైయస్సార్‌ జంక్షన్‌(చామకాలువ), మున్సిపల్‌ ఆఫీస్‌, పద్మావతి నగర్‌, శ్రీనివాస్‌ నగర్‌, సంజీవనగర్‌, బంగారు అంగళ్ల మీదుగా గాంధీ చౌక్‌ చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలనానరు. 44 కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేయాలని, కనీస వేతనాలను కార్మికులందరికీ ఇవ్వాలని, కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఎరువుల ధరలు తగ్గించాలని, వ్యవసాయ కార్మికులకు 200 రోజులు ఉపాధి హామీ పని కల్పించాలని, 600 రూపాయలు రోజువారి కూలివేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కౌలు రైతులకు సమగ్ర చట్టం చేయాలని, ఐదు లక్షల మందికి పైగా రైతులు, ఉద్యోగులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులతో ఢిల్లీలో జరిగే ప్రదర్శన, భారీ బహిరంగ సభలో ప్రజలు అత్యధికంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్‌, కె.మహమ్మద్‌ గౌస్‌, పట్టణ కోశాధికారి వెంకట లింగం, నాయకులు సుబ్బారావు, జైలాన్‌, మధు, వెంకట్రావు, కార్మికులు పాల్గొన్నారు. పాములపాడు : సిఐటియు, ఎపి రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సామన్న, రైతు సంఘం మండల కార్యదర్శి వెంకటేశ్వరరావులు గోడపత్రికను విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు జగన్నాధ రావు, సురేషు, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. రుద్రవరం : ఏప్రిల్‌ 5న ఢిల్లీలో జరిగే మజ్దూర్‌, కిసాన్‌ సంఘార్స్‌ ర్యాలీలో జిల్లాలోని రైతులు, వ్యవసాయకూలీలు, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ మండలంలోని కోటకొండ, కె.కొత్తూరు, ఎల్లావత్తుల, చిన్న కంబలూరు, కొండ మాయపల్లె, రుద్రవరం, నాగులవరం, నరసాపురం, ఆలమూరు గ్రామాల్లో జీపుయాత్ర ద్వారా ప్రచారం నిర్వహించారు. ఎపి రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు, జిల్లా నాయకుడు శంకర్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మార్క్‌, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి వి.బాల వెంకట్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సుధాకర్‌లు మాట్లాడారు. ప్యాపిలి : చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ప్యాపిలి, జలదుర్గంలోని భవన నిర్మాణ కార్మికుల అడ్డాలలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రహిమాన్‌, పాలెం శ్రీనివాసులు, ఇలియాజ్‌లు కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు. గుర్రప్ప, మనోహర్‌, రామాంజనేయులు, లక్ష్మన్న, తదితరులు పాల్గొన్నారు. మహానంది : చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు, వ్యకాసం, రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని తమ్మడపల్లె, బుక్కాపురం, తిమ్మాపురం, మహానంది, గాజుల పల్లె గ్రామాల్లో జీపు జాతా చేపట్టారు. కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. వ్యకాసం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్‌, సిఐటియు జిల్లా కార్యదర్శి బి బాల వెంకట్‌, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌.మార్కు, సిఐటియు మండల కార్యదర్శి కే సోమన్న, ఆశ యూనియన్‌ జిల్లా నాయకురాలు భారతి మాట్లాడారు. సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.