ప్రజాశక్తి - ములగాడ
ఏప్రిల్ 5న చేపట్టే చలో ఢిల్లీని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు పిలుపునిచ్చారు. బుధవారం హెచ్‌పిసిఎల్ లేబర్ గేట్ వద్ద సిఐటియు మల్కాపురంజోన్ కమిటీ ఆధ్వర్యాన గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 5వ తేదీన కార్మిక, కర్షక సంఘర్ష ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు. నేడు మోడీ నియంతపాలన చేస్తూ ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. అంబానీ అదానీలకు కొమ్ము కాస్తూ దేశసంపదను అమ్మకానికి పెడుతున్నారని మండి పడ్డారు. మోడీపాలనలో గిట్టుబాటు ధర లేక రైతులకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, నిరుద్యోగం పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రయివేటీకరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సిఐటియు మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మణమూర్తి మాట్లాడుతూ, ఏప్రిల్ 5వ తేదీన జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ప్రదర్శన, మార్చి 31న సింథియా నుంచి జింక్ గేట్ వరకు బైక్ ర్యాలీ, ఏప్రిల్ 4వరకు వార్డుల్లో పాదయాత్రలు నిర్వVించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జోన్ అధ్యక్షులు కె.పెంటారావు, జి.నరేష్, ఎస్.వాసు, మహేంద్ర, బి.శ్రును ప్రేమ్, విష్ణు, ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.
ఆనందపురం : ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు ఆధ్వర్యాన ఆనందపురం కూడలిలో ర్యాలీ నిర్వహించారు. ఆనందపురం పూల మార్కెట్, బంటుపల్లి వారి కల్లాలు రోడ్డు, వేముల మెయిన్ రోడ్డు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు భీమిలి జోన్ కార్యదర్శి రవ్వ నర్సింగరావు మాట్లాడుతూ, కార్మిక, కర్షక, ఉద్యోగ, రైతులు, సామాన్య ప్రజలందరూ తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శరత్‌చంద్ర, శివశంకర్ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
ఎంవిపి.కాలనీ : 94వ వార్డులో జరిగిన సమావేశంలో చలో ఢిల్లీ కార్యక్రమంపై జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) గౌరవ అధ్యక్షులు పి.వెంకటరెడ్డి మాట్లాడారు. వార్డు నాయకురాలు సోములమ్మ అధ్యక్షతన సమావేశం జరిగింది.
చోడవరం : ఏప్రిల్ 5న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షలు రుత్తల శంకర్రావు పిలుపునిచ్చారు. స్థానిక మెయిన్ స్కూల్లో వివిధ రంగాల కార్మికులతో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్కీమ్‌వర్కర్లకు కనీస వేతనం అమలు చేయలేదని, పిఎఫ్ ప్రమాద బీమా సౌకర్యం కల్పించలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.వరలక్ష్మి, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎస్‌వి. నాయుడు, ఆశా యూనియన్ జిల్లా కార్యదర్శి కె.వరలక్ష్మి ,రామలక్ష్మి పాల్గొన్నారు.
దేవరాపల్లి : గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, రైతులు పండిస్తున్న పంటలకు మద్దతు ధర ఇవ్వాలని, కౌలు రైతులకు సమగ్రమైన చట్టం చేయాలని డిమాండ్లతో ఏప్రిల్ 5న చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంపి వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న పిలుపునిచ్చారు. బుదవారం ఉపాధి కూలీలు పనులు చేస్తున్న ప్రాంతంలో చలో ఢిల్లీ కరపత్రాలతో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూలీలు పాల్గొన్నారు.
కశింకోట : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 5న చలో ఢిల్లీలో సందర్భంగా జరుగుతున్న కార్మిక కర్షిక ప్రదర్శనలో పాల్గొనాలని సిఐటియు జిల్లా నాయకులు దాకారపు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మండలంలోని బయ్యవరంలో ఆటో వర్కర్లకు చలో ఢిల్లీపై కరపత్రాల పంపిణీ చేశారు.










