ప్రజాశక్తి-అనకాపల్లి
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 5న సిఐటియు, కార్మిక కర్షక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి సోమవారం రాత్రి అధిక సంఖ్యలో నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఎ.బాలకృష్ణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ శంకర్ రావు, ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, ఎండిఎం రాష్ట్ర అధ్యక్షులు జి వరలక్ష్మి మాట్లాడుతూ ఏప్రిల్ 5న ఢిల్లీలో లక్షలాదిమంది రైతులు కార్మికులతో ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. దేశ సంపదను మోడీ అంబానీ అదాని వంటి కార్పొరేట్ కంపెనీలకు దోచి పెడుతున్నారన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు అప్పుల ఊబిలో కూరుకుపోయి 20 నిమిషాలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎం.శ్రీదేవి, జె.ధనలక్ష్మి, జి డేవిడ్ నాయుడు, కే సోమినాయుడు తదితరులు పాల్గొన్నారు.
అచ్చుతాపురం : చలో ఢిల్లీ కార్యక్రమానికి మండలం నుంచి సోమవారం రాత్రి ప్రజా సంఘాల ప్రతినిధులు బయలుదేరి వెళ్లారు. అచ్యుతాపురం నుంచి వెళ్లిన వారిలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాము, మండల కార్యదర్శి కె సోము నాయుడు, వ్యవసాయ కార్మిక సంఘ ప్రతినిధి ఎస్ రామునాయుడు , ఏపీ రైతు సంఘం ప్రతినిధి ఎల్లపు ఆదిబాబు ఉన్నారు.
స్టీల్ సిఐటియు నాయకులు
ఉక్కునగరం : చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా స్టీల్ సిఐటియు ఆధ్వర్యాన కార్మికులు ఢిల్లీ తరలివెళ్లారు. దువ్వాడ రైల్వే స్టేషన్లో స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పాలన చేస్తోందని, దీనికి వ్యతిరేకంగానే కర్షక, కార్మిక ఐక్యతతో బుధవారం న్యూఢిల్లీలో ర్యాలీ చేసి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలను ఐక్యం చేసే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ ర్యాలీలో ప్రధానంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని రాజధానిలో వినిపించనున్నట్లు స్పష్టం చేశారు. స్టీల్ సిఐటియు నాయకులు పి.శ్రీనివాసరాజు, టివికె.రాజు తదితరులు ఢిల్లీ వెళ్తున్న వారికి నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు. వీరికి వీడ్కోలు పలికిన వారిలో నగర సిఐటియు అధ్యక్షులు కెఎం.శ్రీనివాస్, స్టీల్ సిఐటియు నాయకులు యు.వెంకటేశ్వర్లు, వివిధ విభాగాల అధ్యక్షకార్యదర్శులు, కార్మికులు ఉన్నారు.










