ప్రజాశక్తి-యంత్రాంగం
రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, గిరిజన హక్కులు, వనరుల రక్షణ, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు రక్షణ కోసం ఏప్రిల్ 5వ తేదీన చేపట్టే చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను మంగళవారం విశాఖ, అనకాపల్లి జిల్లాలోని పలుచోట్ల ఆవిష్కరించారు.
అనకాపల్లి : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 5న చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను స్థానిక దొడ్డి రామునాయుడు కార్మిక కర్షక నిలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.శంకరరావు, ఎపి కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి ఎ.బాలకృష్ణ, ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో కార్మిక కర్షకులు, అణగారిన వర్గాలకు మరింత ఆర్థిక భారాలు మోపే విధంగా ఉందన్నారు. ప్రభుత్వ సంస్థలను కాపాడాలని, అధిక ధరలను అరికట్టాలని, పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
చోడవరం : ఏప్రిల్ 5 జరిగే ఛలో ఢిల్లీని విజయవంతం చేయాలని ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి.వరలక్ష్మి పిలుపునిచ్చారు. మంగళవారంఓ చోడవరంలో చలో ఢిల్లీ పోస్టరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎస్.అమ్మాజీ, పార్వతి, రాజులమ్మ, సత్యవతి, మాణిక్యం, దేముడమ్మ, అర్.బుచ్చిరాజమ్మ పాల్గొన్నారు.
అచ్యుతాపురం : ఎస్‌ఇజెడ్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక సెజ్ పరిశ్రమలలో మంగళవారం కార్మికులతో కలిసి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలలో 75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం సవరించిన కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము, మండల కార్యదర్శి కె సోము నాయుడు, నాయకులు రాజు, కిషోర్, నరేంద్ర పాల్గొన్నారు.
గాజువాక : చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతూ గాజువాకలోని సిఐటియు కార్యాలయం వద్ద పోస్టర్లను ఆవిష్కరించారు. సిఐటియు అధ్యక్ష, కార్యదర్శులు డి.రమణ, ఎ.లోకేష్, జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) గాజువాక జోన్ కమిటీ ప్రధాన కార్యదర్శి గొలగాని అప్పారావు, సిపిఎం గాజువాక జోన్ కార్యదర్శి ఎం.రాంబాబు మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మొద్దు, ప్రభుత్వ రంగంలోని కొనసాగించాలని, ప్రభుత్వ రంగ సంస్థలు, సర్వీసుల ప్రైవేటీకరణ ఆపాలని, వాటిని లీజుకిచ్చే పద్ధతులను, కార్మికులకు నష్టం చేసి నాలుగు లేబరు కోడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. ప్రజలందరూ మోడీ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టే ప్రచారంలో పాల్గొనాలని కోరారు. ఈ నెల 31వ తేదీన ఉదయం 10 గంటలకు పాత గాజువాక నుంచి వైజాగ్ వరకు బైక్ ర్యాలీలో ఉంటుందని పేర్కొన్నారు.
పిఎం పాలెం : జోన్-2 కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు మధురవాడ జోన్ నాయకులు పోస్టర్‌ను విడుదలచేశారు. సిఐటియు జోన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.కొండమ్మ, పి.రాజ్‌కుమార్ మాట్లాడుతూ, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు, కనీస పింఛన్ రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జోన్ నాయకులు డి.అప్పలరాజు, వి.సంధ్య, జి.చిన్నారావు, రాజు, విప్లవ కుమార్, జి.బంగార్రాజు, కుమారి పాల్గొన్నారు.
పలు చోట్ల ర్యాలీలు
కశింకోట : ఏప్రిల్ 5న ఢిల్లీలో జరుగు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు, ప్రజా మహిళ సంఘాల ఆధ్వర్యాన మంగళవారం మండల కేంద్రంలో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా స్కీమ్ వర్కర్ల నాయకులు కె.శాంతి, ఎం శ్రీదేవి, ఐద్వా నాయకురాలు డిడి వరలక్ష్మి, భార్గవి, సిఐటియు జిల్లా నాయకులు దాకారపు శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికులను యజమానులకు బానిసలుగా చేసే విధంగా మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పులు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ అమ్మాజీ, మణి కుమారి, లావణ్య, లక్ష్మి, నాగమణి, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
పరవాడ : ఏప్రిల్ 5న చలో ఢిల్లీని విజయవంతం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో పరవాడ సినిమా హాల్ జంక్షన్ నుండి తహశీల్దారు కార్యాలయం వరకు మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, నాయకులు గేదెల అప్పారావు, కొండూరు నాయుడు, బి.శ్రీను, సిహెచ్ అప్పలనాయుడు పాల్గొన్నారు.
పద్మనాభం : చలో ఢిల్లీని విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు రవ్వ నర్సింగరావు ఆధ్వర్యాన పద్మనాభం జంక్షన్‌లో ర్యాలీ నిర్వహించారు.










