Jul 31,2023 23:11

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: గ్రామ పంచాయతీలకు ఇస్తున్న ఆర్థిక సంఘం నిధుల దారి మళ్లింపుపై సర్పంచ్‌ల సంఘం, పంచాయతీరాజ్‌ ఛాంబర్స్‌ సంయుక్తంగా ఈ నెల 2న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు పిలుపునిచ్చారు. ఎంపీ క్యాంపు కార్యాలయంలో సర్పంచ్‌ల చలో ఢిల్లీ పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏడున్నర దశాబ్ధాల పాటు పోరాడి సాదించుకున్న గ్రామ పంచాయతీల హక్కులకు వైసిపి ప్రభుత్వ హయాంలో తీవ్రనష్టం జరిగిందన్నారు. చివరకు గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఉన్న ఆర్థిక సంఘం నిధులు, జనరల్‌ ఫండ్‌ నిధులూ ప్రభుత్వమే చౌర్యానికి పాల్పడడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ తరహా నేర ప్రవృత్తి ఉన్న ఆలోచనలు గలంలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల వల్ల గ్రామాల్లో పంచాయతీలు నిర్వీర్యమవుతున్నాయని అన్నారు. అందువల్ల కేంద్రం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షులు గొండు శంకర్‌, పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనేపు రామకృష్ణ, అంపోలు మాజీ సర్పంచ్‌ గొండు వెంకట రమణమూర్తి, తూలుగు మాజీ సర్పంచ్‌ కొయ్యాన జగదీష్‌ పాల్గొన్నారు.