Apr 01,2023 00:23

గాజువాకలో బైక్‌ ర్యాలీ చేస్తున్న సిఐటియు నాయకులు

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 5న చలో ఢిల్లీ ఆందోళన, ధర్నా జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో పలుచోట్ల బైక్‌ ర్యాలీలు నిర్వహించారు.
ప్రజాశక్తి- గాజువాక : ప్రభుత్వ రంగసంస్థలకు కార్పొరేట్లకు ధారదత్తం చేయడం, కార్మిక చట్టాలను కోడ్‌లుగా మార్చి కార్మికుల హక్కులను కాలరాయడం, అధిక ధరలు, ఇతర ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ ఆందోళన జయప్రదంచేయాలని కోరుతూ గాజువాకలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సిఐటియు నగర కమిటీ సభ్యుడు రాంబాబు, గాజువాక ప్రధాన కార్యదర్శి ఎ.లోకేష్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ అప్పారావు, సహాయ కార్యదర్శి సురేష్‌, గణేష్‌, నానాజీ పాల్గొన్నారు.
తగరపువలస : చలో ఢిల్లీ జయప్రదాన్ని కాంక్షిస్తూ సిఐటియు భీమిలి జోన్‌ ఆధ్వర్యంలో యూనియన్‌ కార్యాలయం నుంచి జంక్షన్‌ మీదుగా తాతా థియేటర్‌ వరకు మోటారు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. యూనియన్‌ జోన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి, రవ్వ నరసింగరావు, నాయకులు ఎస్‌ అప్పలనాయుడు, ఎస్‌ శ్రీనివాసవర్మ, ముద్దాడ రాము, ముఠా కార్మికులు పాల్గొన్నారు
పెందుర్తి : 5న చలో ఢిల్లీ ఆందోళన జయప్రదం చేయాలని కోరుతూ పెందుర్తిలో సిఐటియు ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సిఐటియు జిల్లా నేత జగన్‌ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం మతం పేరుతో ప్రజలను విడదీస్తూ నిరంకుశ పాలన సాగిస్తోందన్నారు. సిఐటియు జోన్‌ కార్యదర్శి శంకరరావు మాట్లాడుతూ కార్మికచట్టాలను కోడ్‌లుగా సంస్కరించి యజమానులకు కార్మికులను కట్టుబానిసలు చేసిందని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎన్‌.శంకరరావు, జగన్నాధస్వామి, అప్పారావు, ప్రకాష్‌, బిటి మూర్తి, సిపిఎం జోన్‌ కార్యదర్శి బి. రమణి పాల్గొన్నారు.
ములగాడ : చలో ఢిల్లీ జయప్రదానికి సిఐటియు మల్కాపురంజోన్‌ కమిటీ ఆద్వర్యంలో సింధియా నుండి జింక్‌ గేట్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సిఐటియు మల్కాపురంజోన్‌ కార్యదర్శి ఆర్‌.లక్ష్మణమూర్తి మాట్లాడుతూ చలో ఢిల్లీ ఆందోళన జయప్రదంతో కేంద్రానికి కనువిప్పు కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. సిఐటియు మల్కాపురం జోన్‌ అధ్యక్షులు కె.పెంటారావు , షిప్‌యార్డు ఎంప్లాయస్‌ యూనియన్‌, సిఐటియు గౌరవాధ్యక్షుడు కె.జానకిరామ్‌ బిఎస్‌ఎన్‌.రాజా, ప్రధాన కార్యదర్శి ఎస్‌.ప్రసాద్‌, రాంజీ, అంబేద్కర్‌, వి.ప్రసాద్‌, హెచ్‌పిసియల్‌ యూనియన్‌ నేతలు నాగచైతన్య, దిలీప్‌, జివిఎంసి యూనియన్‌ నేతలు కె.రమణ బి.సూరిబాబు పెన్షనర్స సంఘం నాయకులు బి.తాతాజీ పాల్గొన్నారు.
విశాఖ కలెక్టరేట్‌ : సిఐటియు జగదాంబ జోన్‌ కమిటీ, ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నగరంలో బైకు ర్యాలీ చేపట్టారు. ఎపిఎంఎస్‌ఆర్‌యు రాష్ట్ర కార్యదర్శి కెవిపి.చంద్రమౌళి మాట్లాడారు. తొలుత ఈ బైకు ర్యాలీని సిఐటియు సీనియర్‌ నాయకులు వై.రాజు ప్రారంభించారు. కార్యక్రమంలో మీసాల హరి, ఎం.సుబ్బారావు, శ్రీకాంత్‌, సంజరు, తదితరులు పాల్గొన్నారు. టిఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌ నుంచి డిఆర్‌ఎఫ్‌ ఆఫీసు, అల్లిపురం కెప్టెన్‌ రామారావు జంక్షన్‌, రామకృష్ణ జంక్షన్‌, దుర్గాలమ్మ గుడి, పోలీస్‌ బ్యారెక్స్‌, జగదాంబ సెంటర్‌, డాబా గార్డెన్స్‌ మీదుగా జివిఎంసి గాంధీ విగ్రహం వరకూ బైకు ర్యాలీ సాగింది.
పాదయాత్ర
ఎంవిపి.కాలనీ : చలో ఢిల్లీని జయప్రదం చేయాలంటూ సిఐటియు మద్దిలపాలెం జోన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఎంవిపి రైతు బజార్‌ నుంచి డిఆర్‌డిఎ కార్యాలయ సర్కిల్‌ వరకూ పాదయాత్ర చేపట్టారు. సంఘం జోన్‌ కార్యదర్శి పి.వెంకటరావు మాట్లాడారు. నాయకులు ఆర్‌.శ్రీను, కొండమ్మ, అనపర్తి అప్పారావు, ఎం.చంటి, జివిఎంసి 17, 18 వార్డుల కార్మికులు పాల్గొన్నారు.
చలో ఢిల్లీపై విస్తృత ప్రచారం
మునగపాక రూరల్‌ : మోడీ ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్‌ 5న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. సిఐటియు జిల్లా కోశాధికారి వి.వి శ్రీనివాసరావు ఆధ్వర్యాన మునగపాక ప్రాథమిక సహకార సంఘం ఫంక్షన్‌ హాలులో జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీ వంటి వారి సేవలో మునిగితేలుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల అధ్యక్షులు పార్వతి, నాయకులు పద్మ, కుమారి, పెంటకోట సత్యనారాయణ పాల్గొన్నారు.
కశింకోట : సిఐటియు జిల్లా నాయకులు దాకారపు శ్రీనివాసరావు, ఎం.శ్రీదేవి ఆధ్వర్యాన మండలంలోని తేగాడ గ్రామంలో శుక్రవారం చలో ఢిల్లీపై కరపత్ర ప్రచారం చేశారు. రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని చెప్పిన మోడీ రైతుల ఆత్మహత్యలు చేసుకొనే విధంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. చెరుకు ఫ్యాక్టరీలను ఆధునికీకరించి చెరుకు రైతులకు బకాయిలను చెల్లించాలని కోరారు.
పరవాడ : సిఐటియు ఆధ్వర్యంలో సింహాద్రి ఎన్‌టిపిసి మెయిన్‌ గేట్‌ వద్ద చలో ఢిల్లీ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్‌టిపిసిలో కాంటాక్ట్‌ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు, కనీస పెన్షన్‌ రూ.10 వేలు ఇవ్వాలని, నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌టిపిసి కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ సహాయ కార్యదర్శి ఎం.సత్యనారాయణ, నాయకులు డి రామారావు, ఆర్‌.సన్యాసిరావు, ఎస్‌ రామారావు, చందర్రావు పాల్గొన్నారు.
చలో ఢిల్లీ పోస్టర్‌ ఆవిష్కరణ
దేవరాపల్లి : ఏప్రిల్‌ 5న జరగనున్న చలో ఢిల్లీ వాల్‌ పోస్టర్లను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు బిటి.దొర ఆధ్వర్యాన మండలంలోని వాలాబు పంచాయతీ ఇప్పగురువులో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో రెండు లక్షల కోట్లు కేటాయించాలని, కుటుంబానికి 200 పని దినాలు, కనీస వేతనం రోజుకు రూ.600 కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బల్జి గణేష్‌, కదల రాము, ఇరుట గోపాలుడు, పంది శ్రీరాములు, కాదల అచ్చిబాబు పాల్గొన్నారు.
అనకాపల్లి : ముఠా కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అనకాపల్లి ముఠావర్కర్ల సంఘం డిమాండ్‌ చేసింది. స్థానిక పార్సిల్‌ ముఠావర్కర్స్‌ యూనియన్‌ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ముందుగా చలో ఢిల్లీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ కార్మికులకు సంక్షేమ బోర్డు లేకపోవడం వల్ల ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ ఫలాలు అందక వృద్ధాప్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఠా వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు బోడి రాజు, రుత్తల అప్పలనాయుడు, మజ్జి సీతారాం, బోడి రామునాయుడు పాల్గొన్నారు.
గొలుగొండ : గొలుగొండ మండల కేంద్రంలో ఛలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు మాట్లాడుతూ దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డగోలుగా అమ్మెస్తున్నారన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ఎపి రైతు సంఘం జిల్లా ఉపాద్యక్షులు సాపిరెడ్డి నారాయణముర్తి మాట్లాడుతూ రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. సాగు చేస్తున్న దళిత, గిరిజన, బడుగు బహీన వర్గాల రైతులకు పట్టాలు ఇవ్వడం లేదని విమర్శించారు.ఈ కార్యక్రమంలో విఓఎ యూనియన్‌ నాయకులు వెంకటలక్ష్మి, రామారావు, గణేష్‌, చిట్టిబాబు, వాసు తదితర్లు పాల్గొన్నారు.