Mar 26,2023 22:55

ప్రజాశక్తి - భవానీపురం : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలపై, కార్మిక చట్టాలను మార్చి లేబర్‌ కోడ్‌లు రద్దుచేయాలని కోరుతూ ఏప్రిల్‌ 5వ తేదీన చేపట్టిన ఛలో ఢిల్లీలో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్‌. అజరుకుమార్‌, సిఐటియు ఎన్‌టిఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. కేంద్రంలోని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏపిల్‌ 5వ తేదీన తలపెట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు పశ్చిమ సిటీ ఆధ్వర్యంలో ఆదివారం గట్టువెనుక ఊర్మిళానగర్‌లో ప్రచార యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అజరుకుమార్‌ మాట్లాడుతూ ముఠా కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో నిధులు కేటాయించి, వెల్ఫేర్‌ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేటర్‌ సంస్థలైన ఆదానీ, అంబానీలకు వేల కోట్లు దోచిపెడుతున్న మోడీ విధానాలపై ప్రతి ఒక్కరూ ఉద్యమించాలన్నారు. సిఐటియు ఎన్‌టిఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ముఠా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పని భద్రత, పి.ఎఫ్‌, ఈఎస్‌ఐ, పెన్షన్‌ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పశ్చిమ సిటీ అధ్యక్షులు వెంకట్రావు (చౌదరి), కార్యదర్శి ఇ.వి. నారాయణ, నాయకులు ఎస్‌. సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.