పల్నాడు జిల్లా కరస్పాండెంట్: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే వైసిపి ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ఎప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర జలవనురుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, ఉప్పలపాడు గ్రామ పరిధిలోని చల్లపల్లి తండాలో పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలలో ఆదివారం జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, నరస రావుపేట ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో జల జీవన్ మిషన్ ద్వారా రూ.19.44 లక్షలతో ఇళ్ల నిర్మాణాలలో ఏర్పాటు చేసిన నీటి ట్యాప్ కనెక్షన్ ను శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభించారు. చల్లపల్లి తండాలో అర్హులైన ప్రజలకు అటవీశాఖ ఆర్‌ఒఎఫ్‌ఆర్ పట్టాలను కలెక్టర్ పంపిణీ చేశారు. మంత్రి, ఎంపిలు మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో పేద ప్రజలకు అం దిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను వినియోగించుకొని, జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం (గ్రామీణ్) లో ఇల్లు నిర్మించుకునే పేద ప్రజ లకు రూ.1.80 లక్షలను ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, మండల అధికారులు పాల్గొన్నారు.










