ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ఓ వాహనం కింద పడి కుక్క చనిపోవడం, అది గ్రహించేలని ఆ కుక్క పిల్లల్లో రెండు పిల్లలు చనిపోయిన కుక్క చనుబాలను తాగేందుకు ప్రయత్నించి చివరికి పాలు రాక రెండ్రోజుల తర్వాత మృతి చెందడం గమనించిన ఆయన మనసు కకావికలమైంది. అప్పటి నుండి ఖర్చుకు వెరవకుండా వీధి కుక్కల సంరక్షణే ధ్యేయంగా జీవిస్తున్నారు..
సాధారణంగా ఎవరికైనా ఒకట్రెండు కుక్కలను పెంచుకోవడం అలవాటు. అయితే పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని బరంపేటకు చెందిన సుతారం చలమయ్య ప్రస్తుతం 70 వరకూ వీధి కుక్కలను సంరక్షిస్తున్నారు. ఇందుకుగాను నెలకు రూ.80 వేల వరకూ వెచ్చిస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారని అడిగితే తన మనసును కదిలించిన ఘటనను గుర్తు చేసుకుంటున్నారు.
12 ఏళ్ల క్రితం తన ఇంటి సమీపంలో ఒ తల్లి కుక్క వాహనం కింద మృతి చెందగా దాని పిల్లలు తల్లి చనిపోయింది. ఇది గ్రహించలేని పిల్ల కుక్కలు రెండు చనిపోయిన తల్లి కుక్క చను మొనలు వదలకుండా పాలు తాగాలని ప్రయత్నించాయి. అలా రెండ్రోజులు గడిచాక రెండు పిల్లలూ ఆకలితో చనిపోయాయి. ఇది చూసిన చలమయ్య తీవ్రంగా కలత చెందారు. ఇంతలోగా మరో రెండు కుక్క పిల్లలు చర్మవ్యాధికి గురై అవస్థ పడడంతో అవికూడా చనిపోతాయేమోననే ఆందోళనతో వాటిని పశువైద్యుని వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. బిస్కెట్లు, పాలు ఇవ్వడంతో రెండు వారాలకు అవి కోలుకున్నాయి. అప్పటి నుండి వీధి కుక్కల సంరక్షణకు చలమయ్య పూనుకున్నారు.
తన ఇంటి పరిసరాల్లోనే చిన్న షెడ్ వేసి 30 కుక్కలను సంరక్షించడం మొదలుపెట్టారు. అయితే వాటి అరుపుల వల్ల స్థానికులు ఇబ్బందులు పడి మున్సిపాల్టీకి ఫిర్యాదు చేయడంతో కుక్కలను పట్టణ శివారులోని వల్లప చెరువు ప్రాంతానికి చలమయ్య తరలించారు. అక్కడ కొంత భూమిని అద్దెకు తీసుకుని రూ.3 లక్షలతో షెడ్ నిర్మించారు. కొన్ని గదులు, వాటిలో ఫ్యాన్లు ఏర్పాటు చేసి 70 కుక్కలను అక్కడే సంరక్షిస్తున్నారు. వాటికి సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించారు. వాటికి ప్రతిరోజూ బిస్కెట్లు, పాలు, మాంసం, అన్నం ఏర్పాటు చేయడంతోపాటు వాటి సంరక్షణ బాధ్యతలు చూడడానికీ సహాయకులను జీతానికి ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకుగాను నెలరకు రూ.80 వేల వరకూ వెచ్చిస్తున్నట్లు చలమయ్య చెబుతున్నారు.
వీటితోపాటు చలమయ్య తన నివాస ప్రాంతంలోని వీధి కుక్కలనూ ప్రేమగా చూస్తుంటారు. తాను ఎక్కడికి వెళ్లినా వచ్చేటప్పుడు కుక్కల కోసం బిస్కెట్లు తెస్తుంటారు. వాటిని తన ద్విచక్ర వాహనంలోనే పెట్టుకుని కుక్కలు కనిపించగానే వాటికి పెడుతుంటారు. అందుకే ఆయన ఇంటి నుండి బయటకు రాగానే ఆ ప్రాతంలోని వీధికుక్కలు ఆయన్ను చుట్టుముట్టి ప్రేమగా ముద్దాడతాయి. ఆయన వెళ్లేటప్పుడు వీధి చివరి వరకూ వచ్చి వీడ్కోలు పలుకుతాయి. మళ్లీ ఆయన వచ్చేవరకూ ఎదురు చూస్తుంటాయి. ఇంటి దగ్గర నుండి కుక్కల సంరక్షణ షెడ్‌కు వెళ్లే ప్రతి వీధిలోనూ నిత్యం ఇదే దృశ్యాలు కనిపిస్తాయి. వీధుల్లోని కుక్కలను జాగ్రత్తగా సంరక్షిస్తే అవి దొంగలబారి నుండి మనల్ని కాపాడతాయని, ఇళ్లల్లో మిగిలిన ఆహారాన్ని క్కులకు పెట్టాలని చలమయ్య సూచిస్తున్నారు.










