May 08,2022 13:07

ఎండలు మండుతున్నాయి. నీళ్లు తాగిన కొద్దిసేపటికే నాలుక తడారిపోతోంది. ఈ సమయంలో నీళ్లతోపాటు పోషకాలుండే జ్యూస్‌లు తాగితే బాగుంటుంది కదూ. అందుకే ఇంటి దగ్గరే తయారుచేసుకొనే కొన్ని పానీయాలను ఇస్తున్నాం. ఇంకెందుకాలస్యం తయారుచేసి మీరూ రుచి చూడండి.

 

చల్లచల్లగా..



                                                                      మసాలా కీరదోస జ్యూస్‌

కావాల్సిన పదార్థాలు : కీర దోసకాయ- ఒకటి, అల్లం ముక్కలు- స్పూన్‌, పుదీనా ఆకులు - 15 నుంచి 20, తేనె- స్పూన్‌, ఉప్పు - పావుస్పూన్‌, మిరియాల పొడి - అరస్పూన్‌, ఐస్‌క్యూబ్స్‌ - తగినన్ని, నీళ్లు- అరగ్లాసు, నిమ్మకాయ రసం- స్పూన్‌, జీలకర్ర పొడి, ధనియాల పొడి- పావుస్పూన్‌, చాట్‌మసాలా- అరస్పూన్‌, పంచదార లేదా తేనె- తగినంత.
 

తయారుచేసే విధానం :
ముందుగా కీరదోసను శుభ్రంగా కడిగి, పొట్టుతో సహా ముక్కలుగా తరుక్కోవాలి.
తర్వాత మిక్సీజార్‌లో కీరదోస ముక్కలను వేయాలి. అందులో నీళ్లను తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి, మిక్సీ పట్టుకోవాలి.
మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో నీళ్లను పోసి వడకట్టుకోవాలి. ఆ జ్యూస్‌లో చిటికెడు మిరియాల పొడి కలపాలి.
దీంతో మసాలా కీరదోస జ్యూస్‌ రెడీ.
ఇందులో తేనె లేదా పంచదారను కలుపుకోవచ్చు.

 

చల్లచల్లగా..



                                                                        ఖుస్‌ షర్బత్‌

కావాల్సిన పదార్థాలు : ఖుస్‌ (వట్టివేరు) - 70 గ్రా., నీళ్లు - 5 కప్పులు, పంచదార - 4 కప్పులు.
 

తయారుచేసే విధానం :
గడ్డి నుంచి వేర్లను కత్తెరతో కట్‌ చేయాలి.
తర్వాత గడ్డి, వేర్ల (వాడితే) మీద ఉన్న మట్టిని, ఇసుకను శుభ్రంగా కడిగేయాలి.
గడ్డిని తరిగి 12 గంటలు నీళ్లలో నానబెట్టాలి. తర్వాత ఆ నీళ్లను వడకట్టి, పంచదార కలపాలి.
ఆ మిశ్రమాన్ని స్టవ్‌ మీద పెట్టి, పంచదార కరిగే వరకూ గరిటెతో కలుపుతూ వేడిచేయాలి.
సిరప్‌ను తాకినప్పుడు చేతివేళ్లకు అతుక్కుంటుంటే స్టవ్‌ మీద నుంచి గిన్నె పక్కకు తీయాలి.
వేడి సిరప్‌ను వడకట్టి, శుభ్రమైన గాజుసీసాలో పోసి మూతపెట్టాలి.
గది ఉష్ణోగ్రతకు చేరుకున్నాక సిరప్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి.
గ్లాసు నీళ్లలో పావు సిరప్‌ వేసి కలిపితే ఖుస్‌ షర్బత్‌ రెడీ.
వేసవి దాహార్తికి చెక్‌ పెట్టేందుకు ఇది చాలా బాగా పనిచేస్తుంది.

 

చల్లచల్లగా..



                                                                      నిమ్మకాయ-పుదీనా జ్యూస్‌ ..

కావాల్సిన పదార్థాలు : లెమన్‌ డ్రింక్‌ (లిమ్కా లేదా స్ప్రైట్‌) - 500 మి.లీ., తాజా పుదీనా ఆకులు - కప్పు, తాజా నిమ్మరసం - 2 స్పూన్లు లేదా పెద్ద నిమ్మకాయ, ఉప్పు - కొద్దిగా, ఐస్‌ క్యూబ్‌లు- అరకప్పు (కొద్దిగా కూలింగ్‌కోసం), నీళ్లు- అరకప్పు.
 

తయారుచేసే విధానం :
ముందుగా పుదీనా ఆకుల్ని... మెత్తగా పేస్టులా చేసుకోవాలి. అందుకోసం కొద్దిగా నీరు పోసుకోవచ్చు.
తర్వాత అరకప్పు నీళ్లుపోసి, మిక్సీలో బ్లెండ్‌ చేయాలి. దానిని వడగట్టి వచ్చిన రసాన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి.
ఎప్పుడు తాగాలనుకుంటే అప్పుడు పుదీనా రసాన్ని ఫ్రిజ్‌ నుంచి బయటకు తీసి, అందులో నిమ్మరసం, ఉప్పువేసి బాగా కలపాలి.
కొద్దిగా ఐస్‌ముక్కలను గ్లాసుల్లో వేసుకోవాలి. తర్వాత పుదీనా రసాన్ని ఆ గ్లాసుల్లో సమానంగా పోయాలి.
లిమ్కా లేదా స్ప్రైట్‌ డ్రింకును ఆ జ్యూస్‌లో కలిపి వెంటనే తాగాలి.
అయితే ఎక్కువ కూలింగ్‌ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

 

చల్లచల్లగా..



                                                                         కర్బూజా జ్యూస్‌..

కావాల్సిన పదార్థాలు : కొబ్బరి నీళ్లు - గ్లాసు, కర్బూజ ముక్కలు - 2 కప్పులు, పాలు - 3 కప్పులు, చక్కెర - పావుకప్పు, క్రీం - 4 స్పూన్స్‌, రోజ్‌ వాటర్‌ - అరకప్పు, తేనె - స్పూన్‌.
 

తయారుచేసే విధానం :
ముందుగా కొబ్బరి నీళ్ళను ఒక పాత్రలోకి తీసుకోవాలి.
తర్వాత కొబ్బరి బొండాంలోని లేత కొబ్బరి తీయాలి. లేతకొబ్బరి, కర్బూజ ముక్కలు విడివిడిగా జ్యూసర్లో వేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని కలుపుకోవాలి.
అందులో కాచి చల్లార్చిన పాలు, కొబ్బరి నీళ్ళు, రోజ్‌ వాటర్‌, చక్కెర / తేనె వేయాలి. దానిని కొంచెంసేపు మిక్సీ చేసి, నురగ వచ్చిన తర్వాత ఒక గాజు పాత్రలో పోయాలి.
పైన క్రీం వేసి ఫ్రిజ్‌లో పెట్టి, కూల్‌ అయిన తర్వాత సర్వ్‌ చేయాలి.

 

చల్లచల్లగా..



                                                                                జింజర్‌ ఫ్రూట్‌ పంచ్‌..

కావాల్సిన పదార్థాలు : అల్లం- ఎనిమిది అంగుళాల ముక్క, పంచదార- కప్పు, నిమ్మరసం- కప్పు, కమలాపండ్ల రసం- ఒకటిన్నర కప్పు, చల్లనినీళ్లు- 3 కప్పులు.
 

తయారుచేసే విధానం :
అల్లం పైపొట్టు తీసి సన్నగా తురమాలి. మందపాటి పాన్‌లో అల్లం తురుము, పంచదార, నీళ్లుపోసి మరిగించాలి.
తర్వాత మంట తగ్గించి, మూత తీసి మరో పదిహేను నిమిషాలు మరగనివ్వాలి.
దానిలో ఏ ముక్కలు లేకుండా వడగట్టి చల్లారనివ్వాలి.
అందులో నిమ్మరసం, కమలారసం కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
జ్యూస్‌ తాగేముందు ఫ్రిజ్‌లో నుంచి బయటకు తీసి, చల్లనినీళ్లు కలిపి ఐస్‌క్యూబ్స్‌ వేసుకొని తాగాలి.