హిందూపురం : హిందూపురం మండలం చలివెందుల గ్రామ పంచాయతీకి శనివారం జరిగిన సర్పంచి ఉప ఎన్నికల్లో వైసిపి మద్దతుదారుడు ఉపేంద్ర కుమార్ రెడ్డి విజయం సాధించారు. టిడిపి మద్దతు దారుడు రవీంద్ర రెడ్డిపై 337 ఓట్ల ఆధీక్యంతో గెలుపొందారు. గత సర్పంచు ఎన్నికల్లో ఉపేంద్ర కుమార్ రెడ్డి తల్లి సౌభాగ్యమ్మ 711 ఓట్ల అధిక్యంతో గెలుపొందగా ప్రస్తుత ఎన్నికల్లో 337 ఓట్లతో మాత్రమే ఆమె తనయుడు ఉపేంద్ర కుమార్ రెడ్డి విజయం సాధించారు. మెజార్టీ భారీగా తగ్గడంపై అధికార పార్టీ నాయకులను విస్మయానికి గురి చేస్తోంది. అధికార పార్టీకి గట్టిపోటీనే ఇచ్చామని టిడిపి నాయకులు చెబుతున్నారు. చలివెందుల పంచాయతీలో మొత్తం 2514 ఓట్లు ఉండగా 2077 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారి నరేంద్ర కుమార్ వైసిపి మద్దతుదారుడు ఉపేంద్ర కుమార్ రెడ్డి 337 ఓట్ల అధిక్యంతో విజయం సాధించినట్లు ప్రకటించి, డిక్లరేషన్ పత్రాన్ని అందించారు. ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో డీఎస్పీ కంజాక్షన్ ఆధ్వర్యంలో ఎక్కడా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.










