ప్రజాశక్తి -యంత్రాంగం
ఆనందపురం : మండలంలోని బోయపాలెం జంక్షన్లో ఆటోస్టాండ్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఆనందపురం ట్రాఫిక్ ఎస్‌ఐ రఘురామ్ ప్రారంభించారు. సుమారు 1000 మంది పాదచారులు, వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ, ఈ సంవత్సరం వేసవితాపం చాలా ఎక్కువగా ఉంటుందని, ప్రజలు బయట తిరిగేటప్పుడు తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఇలాంటి చలివేంద్రాలను వీలైనంత ఎక్కువగా మండలంలో ఏర్పాటుచేసి దాహార్తిని తీర్చాలని కోరారు. వేసవి తీవ్రత నేపథ్యంలో చెట్ల దగ్గర నీరు పెట్టి పక్షి సంపదను కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, బోయపాలెం ఆటోస్టాండ్ ప్రెసిడెంట్ చిట్టిబాబు, డ్రైవర్లు పాల్గొన్నారు.
పిఎం పాలెం : 5వ వార్డు పరిధి సాయిరాంకాలనీ శ్రీకృష్ణ భజన మండలి ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని టిడిపి బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు ప్రారంభించి కాలనీవాసులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ, ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సాయిరాం కాలనీ పెద్దలు ఆవాల నీలయ్య, జగన్నాథం, బొట్ట కోటి, జోగా సూర్య, ఆవాల లక్ష్మణ, బొడ్డేపల్లి రంగ, కర్రి సన్యాసిరావు, కాలనీ మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.










