Jan 30,2022 12:41

చలి పులి మళ్లీ పంజా విసురుతోంది
అదును చూసి విరుచుకుపడుతోంది
పొద్దు వాలకముందే ఊళ్లపై మాటువేస్తోంది
రాత్రంతా కల తిరుగుతూ భయపెడుతోంది
మంచు కరిగినా మడమ తిప్పటం లేదు
తొమ్మిది కొట్టినా తొణకటం లేదు

ఆరు గంటలకే ఊళ్లు దుప్పట్లు కప్పేస్తున్నాయి
విను వీధులు రాకముందే వీధులు బోసిపోతున్నాయి
దీపాల వేళకు దారులు చిన్నబోతున్నాయి
వా'కింగు' ల జాడ కానరావటం లేదు
యోగా యోగులు శవాసనాలేస్తున్నారు
'ముసుగు' వీరుల సంచారం ముమ్మరమయ్యింది
శాలువాలు జనాలపై స్వారీ చేస్తున్నాయి
చన్నీళ్లు మంచు కత్తులై ఊచకోత కోస్తున్నాయి
నేపాలీ సైన్యం పహారా మొదలయ్యింది

జనాలు పులి దాడికి దొరకని దారుల్ని వెతుక్కుంటున్నారు
మఫ్టీలో ఉన్న మఫ్లర్ల మడతల్లో
చెవులు చుట్టేస్తున్నారు
మంకీ క్యాపుల్లో మొహం చాటేస్తున్నారు
రగ్గుల పొరల్లో ఒంటిని దాచేస్తున్నారు
స్వెట్టర్ల కుంపట్లో వేడి కాచుకుంటున్నారు
రాత్రి వేళల్లో పులి గాండ్రింపుకి
వెన్నులో చలి పుడుతోంది
కండరాలు గడ్డ కడుతున్నాయి
నరాలు చుట్టుకుపోతున్నాయి
దంతాలు దారితప్పి ఢకొీట్టుకుంటున్నాయి
మధుమేహం లేకపోయినా పరుగులు

ఆకలి పులి ఆవురావురుమంటూ
కోరలు చాస్తోంది
పిల్లలను పట్టుకుపోకుండా చూసుకోవాలి
ముసలివారిని మింగెయ్యకుండా కాపాడుకోవాలి
పడుచువారు సైతం పదిలంగా ఉండాలి
పులిని తరిమివేయటం ఎవరి తరమూ కాదు
తప్పించుకు తిరగటం ఒక్కటే పరిష్కారం

డా.ఎం.కోటేశ్వరరావు
70755 89571