Nov 29,2020 11:59

'తిర్పతి మడిసని ఆ కేశవయ్యను నమ్ముకొని వస్తే నట్టేట్లో ముంచేస్తాడా?' అన్నాడు సింగారం.
'తిర్పతి మడిసైతే మనకు సాయమెందుకు సేయ్యాలా?' అన్నాడు గురవయ్య.
'ఆడ్ని నమ్ముకొని మన పన్నెండు ఇండ్లోళ్లు మహారాష్ట్రకు వస్తిమి' అన్నాడు మునెప్ప.
'గురవయ్యా! ఆడు మన ఊరికొచ్చి.. ''మా తిర్పతోళ్ళ కన్నా పక్కూరైనా మీ ఊరోళ్లు బాగా పనిసేస్తారని'' సెప్పి మన ఇండ్లోళ్ళందరినీ పిల్సుకొచ్చాడు' అన్నాడు సింగారం.
'సింగారం! ఆడెంసెప్పినా తలకాయలాడిస్తూ పనిసేసే గొర్రెలు కావాలి. మనం గొర్రెల్లా తలాడించుకొంటూ వస్తిమి. మీరంతా ఆడ్ని గంగమ్మను తలకాయమీంద పెట్టుకున్నట్లు పెట్టుకొంటిరి. దుడ్డుమీంద ఆశున్నోడు మడుసుల్ని సూడరు, సందు దొరికితే యామారుస్తారు. మనూరోళ్లే మన దగ్గర పనిసేయించుకొని మోసం చేస్తుంటే ఏమీ సేయలేక ఈడు పిలిస్తే వస్తిమి. ఈ డబ్బునోళ్ల బుద్ధులే అంతే!' అన్నాడు గురవయ్య.
'అనుమంతుని తోకలా ఆడి ఎనకాలనే వచ్చినందుకు బాగా బుద్ది సెప్పాడు!'
'నన్ను నమ్మి నా తావన (దగ్గర) పని సేయడానికి వచ్చినోల్లని నేనన్నాయం సేయను. మీ అందరి దుడ్లు నాకెందుకు. లాక్‌డౌన్‌ పూడ్చాక మీ అందరి దుడ్లు సత్తేప్రమాణంగా ఇస్తానని కేశవయ్య సెప్పాడుగా' అన్నాడు ఇంకొకడు.
'ఒరే తిక్క ఎదవా నువ్వు అర్థం సేసుకొందంతే.. మనమంతా ఈ ఊరిడిసి పూడిస్తే ఇక ఈడకు రామని పిలకాయలకు తెలిసినప్పుడు ఆ కేశవయ్యకు తెలీదా? నువ్వు మట్టుమ్‌ కాదు మనమంతా తిక్క ఎధవలం. మన పక్కూరోడని నమ్మి, కూలీ దుడ్డు తీసుకోకుండా ఆడి దగ్గరే కూడబెట్టింది పెద్ద తప్పు. మన దుడ్డు ఆడికి దండిగా సేరింది. మనకివ్వాల్సిన దుడ్లు వాడి బొడ్లో దోపుకొని, మనకు నామం పెడ్తాడు. ఒక్కొక్కడు ఇరవై వేల రూపాయల దాకా కూడబెట్టారని తెల్సు' అన్నాడు గురవయ్య
'గురువయ్యా! నాది 24 వేల రూపాయలుంది మన గుడిసెల్లో దాచి పెట్టే జాగా లేదని వాడి దగ్గర కూడబెట్టాము. మనూరికి పోయేప్పుడు మొత్తం తీసుకుపోదామనుకొంటి. లాక్‌డౌన్‌ పూడ్చిందంటే కొంచెం దినాల్లో మీ దుడ్డు మీకిస్తానని చెప్పడం వల్ల ఏంసేయలేకపోయాను. ఆడు ఈనని సెప్తే నేనే ఆడ్ని మేక తలను నరికినట్లు నరికేసేవాడ్ని' అన్నాడు మునెప్ప.
'నీకత తెలిసే అలా సెప్పాడు. నీవు ఈ పట్నం ఇడిసి ఎల్తే మళ్ళా ఈడకు రావని ఆడికి తెలుసు!' అన్నాడు గురవయ్య.
'ఆడు తిరప్తికి వస్తే ఆడి తోలు తీస్తాను!' కోపంతో సెప్పాడు మునెప్ప.
'ఈ లాక్‌డౌన్‌ పూడ్చేవరకూ మనం ఇక్కడుంటే సావక తప్పదు. కూలీ లేదు..... గుడిసెల్లో బియ్యం లేదు. అంతా ఓటిగా (ఒక్కటిగా) పోలీస్‌స్టేషన్‌కు పోదామా?' అడిగాడు మునెప్ప.
'ఆడ ఏం సెప్తావు?' అడిగాడు గురవయ్య.
'కేశవయ్య మనకు ఇవ్వాల్సిన దుడ్డు సంగతి సెప్తాము!' అన్నాడు మునెప్ప.
'డబ్బున్నోడి దగ్గర మనం డబ్బడిగితే ఏదైనా తనఖా పెట్టమంటారు. లేదంటే వట్టి పేపర్‌ మీంద నీ ఏలి ముద్ర ఎయ్యమంటారు. నీవు ఆడి దగ్గర డబ్బు కూడబెట్టిందానికి ఏమైనా సాక్షం ఉందాని పోలీసోల్లు అడిగితే ఎంసెప్తావ్‌?' అన్నాడు గురవయ్య.
'గురువయ్యా! నీ మాటలు వింటుంటే మనం ఏమారిపోయినట్లే కనబడతాంది నా పాణెం పోయినంతగా గుండె గిలగిలా కొట్టుకొంటాది. ఆ దొంగనాకొడుకు మన దుడ్లు మనకిస్తే ఎట్లైనా మనూరికి నడ్చుకొంటూ పూడవచ్చు' అన్నాడు మునెప్ప.
'లాక్‌డౌన్‌ పూడ్చేవరకు మనం ఇక్కడే ఉండాలి. నడసుకొంటూ వెళ్ళే ఆలోసన మట్టుమ్‌ వద్దు. ఊరొదిలిపోయి నడిసి వెళ్ళేవోళ్ల బతుకులను మనం ప్రతి పొద్దూ టీవీలో సూస్తున్నా బుద్దిరాదా?' అన్నాడు గురవయ్య.
'ఈడ కూలీ దొరకదు. కూలీ లేకుంటే బతకనుమాలదు .. సూస్తుంటే సావు తప్ప ఏరే దోవ లేదేమో!' అన్నాడు మునెప్ప.

***

ఇంటిముందు నిలబడిన కేశవయ్యను చూస్తూ 'ఏం కేశవ్‌ ఎప్పుడూ బిల్డింగ్లు కట్టేవాడివి. లాక్‌డౌన్‌ వల్ల ఆ పని వదిలేసి నీ బిల్డింగ్‌ పని చూసుకున్నావా? నీ ఇల్లు కొత్త ఇల్లులా తయారయింది!' హిందీలో అడిగాడు పోలీసు.
ఆ తరువాత వారి సంభాషణ హిందీలో జరిగింది.
'ఏం చేయమంటారు సార్‌? మా పనులన్నీ అలాగే నిలబడిపోయింది. లాక్‌డౌన్‌లో తగులుకొనడం వల్ల మా ఇంటి మనుషులతోనే ఇంటికి పెయింట్‌ కొట్టడం చిన్న చిన్న రిపైర్లు చేసుకొనడం లాంటి పనులు చేసుకొంటున్నాము!' బదులిచ్చాడు కేశవ్‌.
'ఈ వలసకూలీల బతుకులు చూస్తుంటే చాలా బాధగా ఉంది కేశవ్‌! కూలీ లేక తిండిలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కరోనా నుండి దూరంగా ఉండటానికి గడప దాటద్దొంటుంటే ఏకంగా ఊరు విడిచి, ఎన్నో వందల మైళ్ళ దూరానున్న సొంత ఊళ్లకు నడచి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. చీమల్లా గుంపులుగా పోతున్నారు. అలా వెళ్లడం వల్ల అన్యాయంగా చనిపోతారని హెచ్చరించినా వినకుండా మా మీదే ఎదురుతిరుగుతున్నారు. పని చేయించుకొనే యజమానులు ఆ కూలీల విషయంలో ఎటువంటి బాధ్యతా తీసుకొనడం లేదు' అన్నాడు పోలీసు.
ఆ మాటలకు కేశవయ్య గుండె కలుక్కుమంది. 'పాపం సార్‌!' బాధపడుతున్నట్టుగా అన్నాడు.
'కరోనా వల్ల చీమల్లా బతుకుతున్న వలసకూలీల పుట్టలు ఒక్కసారిగా చెదిరిపోయాయి. దిక్కుతెలీకుండా ఎటో పోతున్నారు!' అన్నాడు పోలీసు.
'ఏంటి సార్‌ ఇటువైపు మా వీధిలోకి వచ్చారు?' అంటూ మాట మార్చాడు కేశవయ్య.

***


'మన పక్కూరోళ్లు అని పిలుసుకు వచ్చావే.. నిన్ను బాగా ఏమార్చినట్లుంది!' కేశవయ్య భార్య ప్రమీల అంది.
'ఆళ్ళు నన్ను ఏమార్చలేదు. కరుగ్గా లెక్క చెప్పి ఆళ్ళకు రావలసింది మట్టుమ్‌ తీసుకొన్నారు. ఒక్క దమ్మిడీ ఎక్కువ తీసుకోలేదు. ముందు నేనే ఆళ్ళని ఏమార్చాలనుకొన్నాను ప్రమీలా .. అంతలోనే వాళ్ళు ఉషారు తెచ్చుకొన్నారు!'
'నీవు వాళ్ళను ఏమార్చాలనుకొన్నావా! యెట్లా?'
'ఆళ్ళు కూలీ డబ్బులు నా దగ్గరే కూడబెట్టుకొనేవాళ్ళు. ఆ ఊరి వాళ్లందరిదీ మొత్తం కలిపితే రెండున్నర లక్ష రూపాయలు పైనే అయింది. లాక్‌డౌన్‌లో కూలీ లేక, కూటికి దోవ లేక ఒక్క పొద్దులుంటన్న ఇసయం తెలుసుకొన్నా, ఇక కొన్ని దినాల్లో ఈ ఊరు విడిసి కండితముగా పూడుస్తారనుకొన్నాను. ఆళ్ళు సలిసీమల్లాంటోళ్లని తెల్సు. ఆ సలిసీమలకు ఇవ్వాల్సిన దుడ్డంతా ఇవ్వకుండా ఏమార్చాలనుకొన్నా. నా దగ్గరొచ్చి అడిగితే లాక్‌డౌన్‌ తరువాత ఇస్తానని దొంగ పెమానం సేస్తిని. నేసెప్పింది నమ్మలేక అలాసేసారు!'
'ఏం సేశారు?' కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది ప్రమీల.
'ఆ సలి సీమలన్నీ ఓటయ్యి, ఓటిగా ఆ లోచించి ఒక ముడివుకు వచ్చాక నేరుగా మనింటికి వస్తిరి. లాక్‌డౌన్‌ పూడిసేదాకా ఈ ఇంట్లోనే ఉంటామని, అంతవరకు ఇంటిలో ఏదో ఒక పని సేస్తామని గురువయ్య సెప్పగానే ఒప్పుకున్నాను!'
'ఆ సీమ అడగ్గానే బయటపొండిరా అని నీవు జగడమేస్తావనుకొంటిని' అంది ప్రమీల.
'ప్రమీలా! నేను తిరుక్కోని జగడమేస్తే ఆళ్ళు మనల్ని సంపుతారు!
'సంపుతారా?!' అంటూ కప్పలా నోరు తెరచి, భయంతో సూసింది.
'ఇబ్బుడు ఓటిగా నున్న సలిసీమలు. ఏఏబలవంతమైన సర్పము ....చలిచీమల చేతజిక్కి చావదె సుమతీ!'' అన్న పద్యంలోని సీమలు నాకండ్లముందు కనపడింది. నీవు వాడి మాటలు మట్టుమ్‌ ఇన్నావు. నేను ఆడికింత ధైర్యం ఎలావచ్చిందో ఆలోచించాను. ఆడి ముఖాన్ని బాగా గమనిస్తిని. భయం లేదు ఏదో ధైర్నం .. అపుడే అర్థం సేసుకొని సరేనన్నాను.'
'ఊరికే సెప్పకూడదు కానీ ఆళ్లంతా మనింట్లోనే ఉండి సాలా సాలా పన్లే సేస్తిరి' అంది ప్రమీల.
'ఇక మీద మన కాంట్రాక్టు పని జరిగేది సాలా కష్టం సొంతూరికెళ్ళిన వారు ఇక రారు!' అన్నాడు కేశవ్‌.
'వాళ్ళను పిలిస్తే వస్తారు.. ఆళ్ళు బతకాలిగా?!' అంది ప్రమీల.
'అబ్బుడు ఆళ్ళుంటున్న సొంతూరులో అన్నాయం ఎదిరించే ధైర్నం లేక ఎలా బతకాలాని దిగులుపడేటప్పుడు నేను పిలుస్తూనే వస్తిరి. ఇబ్బుడు ఆ సలిసీమల్లో కలసికట్టుగా తిరగబడి, అన్నాయం ఎదిరించే ధైర్నం కలిగింది. అందరూ ఓటిగా కలిశారు. ఆళ్ళకు అక్కడే బతుకుతామన్న నమ్మకం వచ్చింది!' అన్నాడు కేశవ్‌.
                                                * ఓట్ర ప్రకాష్‌రావు - 9787446026