ప్రజాశక్తి -సీలేరు
ఏజెన్సీ ప్రాంతంలో చలి పులిగా మారడంతో ప్రజలు గజగజ వణుకుపోతున్నారు. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. ఆదివారం ఆంధ్రా కాశ్మీర్ లంబసింగి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల కనిష్ట స్థాయిలో నమోదయ్యాయి. జీకే వీధి మండలం సీలేరులో గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలు నమోదైంది. సీలేరు పరిసర ప్రాంతాల్లో అధికంగా మంచు కురిసి చల్లటి గాలులు వీయడంతో చలి తీవ్రత మరింత అధికమైంది. తెల్లవారుజామున అధికంగా మంచు కురుస్తోంది. ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు వీడడం లేదు. సీలేరు పరిసర ప్రాంతాలతో పాటు స్థానిక ఏపీ జెన్కో కాలనీ, మార్కెట్ సెంటర్లో అధికంగా మంచు కురుస్తుండడంతో రోడ్లపై సంచరించేందుకు జనం సాహసించడం లేదు. చలి తీవ్రత వలన ఆదివారం దుకాణాలు ఆలస్యంగా తెరిచారు. రోజంతా చల్లటి గాలులు వీశాయి. వారం రోజుల క్రితం వరకు చలి, మంచు తీవ్రత అంతంత మాత్రంగా ఉండేది. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో మంచు తీవ్రతతో పాటు చలి అధికమైంది. సీలేరు నది పరివాహక ప్రాంత ప్రజలతోపాటు ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు చలికి తాళలేక చలి మంటలు కాసుకొని ఉపశమనం పొందుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, పాఠశాల విద్యార్థులు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చింతపల్లి, లంబసింగిలో దాదాపుగా మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో ఈ ప్రాంతాలు అతి శీతలంగా మారాయి. దీంతో మంచు అందాలు, చలిని పర్యాటకులు ఆశ్వాదించి పరవశించిపోతున్నారు. ఈ ప్రాంతాలకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.
దట్టంగా కురుస్తున్న మంచు
పాడేరు : మన్యాన్ని చలి వణికిస్తోంది. గత రెండు రోజులుగా మన్యంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో, చలి తీవ్రత పెరిగింది. మంచు దట్టంగా కురుస్తుండడంతో జన జీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఆదివారం అల్లూరి జిల్లాలో జి.మాడుగుల మండలంలో 4.9, చింతపల్లిలో 5.1, అరకు వ్యాలీలో 5.4, వై.రామవరంలో 5.8, అనంతగిరిలో 5.9, పాడేరులో 6.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో రాత్రి వేళలో కురుస్తున్న మంచు కూడా గడ్డ కడుతోంది. ఈ నెల ఐదు నుంచి ఉన్నట్టుండి చలి తీవ్రత పెరిగింది.
జి.మాడుగుల : మండలంలో ఆదివారం గిరిజనులను చలి గజ గజ వణికించింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తీవ్రమైన చలితో పాటు వాహనాలపై మంచు గడ్డలు కట్టాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా గజగజలాడారు. చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది కాలంలో ఇటువంటి చలి, గడ్డలు కట్టడం ఇదే తొలిసారిగా చూస్తున్నామని స్థానికులు తెలిపారు.
డుంబ్రిగూడ: మండలంలో గత రెండు రోజుల నుంచి దట్టమైన పొగ మంచు వీస్తుండటంతో చలి తీవ్రత పెరిగింది. ఈ చలి తీవ్రతకు తట్టుకోలేక గిరిజనులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. రాత్రి నుంచి ఉదయం 9 గంటల వరకు దట్టమైన పొగ మంచు కురుస్తుండటంతో వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణాలు సాగిస్తున్నారు. అరకు ప్రాంతంలో సందర్శించిన పర్యాటకులు చలి మంటలు వేసుకుంటున్నారు.










