* వరి పంటను కాపాడుకోవాలనే తపనతో..
* చెరువులో మునిగి తండ్రీ కూతుళ్ల మృతి
* పోతునాయుడుపేటలో విషాదం
వాడిపోతున్న వరి పైరును కాపాడుకోవాలన్న తాపత్రయం ఆ తండ్రీ కూతుళ్లకు శాపమైంది. వరి పైరుకు నీరు పెట్టే క్రమంలో చెరువులోకి దిగిన తండ్రి మునిగిపోవడం గమనించి కాపాడేందుకు వెళ్లిన కూతురు చివరి వరకు ప్రయత్నించి తాను తనువు చాలించింది. దీంతో తండ్రీ కూతుళ్ల మృతితో ఆ కుటుంబం గుండె చెరువైంది. వారి రోధనల ధార వరదైంది.
ప్రజాశక్తి- నౌపడ : సంతబొమ్మాళి మండలం హనుమంతు నాయుడుపేట పంచాయతీ పోతునాయుడుపేట గ్రామానికి చెందిన మిత్తాన కామేశ్వరరావు (66) పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో వర్షాలు లేకపోవడంతో పైరు ఎండిపోవడం గమనించి సమీపంలోని చెరువులో ఉన్న నీరు ఇంజిన్ ద్వారా పొలంలో తోడెందుకు మంగళవారం మధ్యాహ్నం పొలానికి బయలుదేరాడు. అదే గ్రామంలో ఉంటున్న కామేశ్వరరావు చిన్న కుమార్తె గిన్ని రాజేశ్వరి (46) తండ్రికి సాయం చేసేందుకు తోడుగా వెళ్లింది. అనంతరం ఇంజిన్ గట్టుపై పెట్టి పైపు నీటిలో ఉంచేందుకు చెరువులో దిగిన కామేశ్వరరావు కాళ్లకి చెరువులో ఉన్న తీగలు చుట్టుకోవడంతో నీటిలో మునిగిపోయాడు. ఇది గమంచిన కుమార్తె రాజేశ్వరి తండ్రిని కాపాడేందుకు చెరువులో దిగింది. తన శాయశక్తులా ప్రయత్నించినా చెరువు లోతు ఎక్కువగా ఉండడం, విపరీతంగా ఉన్న తీగలు కాళ్లకు చుట్టుకోవడంతో తండ్రి ప్రాణాలు కాపాడేం దుకు ఆ కూతురు చివరి వరకూ ప్రయత్నించి తండ్రితో పాటు తానూ తనువు చాలించింది. తండ్రీ కూతుళ్లు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కామేశ్వరరావు భార్య అనుసూయమ్మ గ్రామస్తులను వెంటబెట్టుకుని పొలంలో గాలించేసరికి చెరువులో ఇద్దరి మృతదేహాలు వెలికితీశారు. ఘటన స్థలానికి చేరుకున్న నౌపడ ఎస్‌ఐ కిషోర్ వర్మ శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కామేశ్వరరావుకి భార్య అనుసూయమ్మ, నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమెకు కుమారులు మధు, రవితేజ ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృత్యువాత చెందడంతో పోతు నాయుడుపేటలో విషాదం నెలకొంది. పైరు కాపాడేందుకు వెళ్లి తండ్రీ కూతుళ్లు ప్రాణాలు కోల్పోవడంతో పోతునాయుడుపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్‌ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.










