
* నాగావళిలో జీరో ఇన్‌ఫ్లో
* తోటపల్లి, మడ్డువలస ఆయకట్టు రైతుల తీవ్ర ఇబ్బందులు
* వంశధారలో నామమాత్రపు ప్రవాహం
* కీలక దశలో సాగు కష్టాలు
జిల్లాలో కరువు పరిస్థితులు అంతకంతకూ తీవ్రతరమవుతున్నాయి. నెల రోజులకు పైగా వర్షాలు లేకపోవడంతో, చివరి తడులకు నీరు లేక వేసిన పంటలు ఎండిపోతున్నాయి. జిల్లాలో ప్రధాన నదులైన వంశధార, నాగావళి మునుపెన్నడూ లేని రీతిలో ఎండిపోయాయి. దీంతో పంట కాలువలకు చుక్క నీరు విడిచిపెట్టలేని పరిస్థితి నెలకొంది. వంశధార, తోటపల్లి, మడ్డువలస రిజర్వాయర్ ఆయుకట్టు భూములు ఎండిపోతున్నాయి. చివరి ప్రయత్నంగా రైతులు సమీపంలోని చెరువులు, నీటికుంటల నుంచి నీరు తోడి పంటలను కాపాడుకుంటున్నారు.
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: జిల్లాలో వంశధార, మడ్డువలస, నారాయణపురం ఆయకట్టు ప్రధాన సాగునీటి వనరులుగా ఉన్నాయి. వంశధార ప్రాజెక్టు ద్వారా హిరమండలం గొట్టాబ్యారేజీ ద్వారా వంశధార కుడి, ఎడమ కాలువల కింద 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఇందులో ఎడమ కాలువ ద్వారా 1.70 లక్షల ఎకరాలు, కుడి కాలువ ద్వారా 80 వేల ఎకరాలకు నీటిని అందించాల్సి ఉంది. కాలువల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేయక, షట్టర్లు పాడైపోవడం, కాలువల్లో పెద్దఎత్తున గుర్రపు డెక్క పేరుకుపోవడంతో గొట్టాబ్యారేజీ వద్ద నీళ్లు ఉన్నా రెండు కాలువల కింద మొత్తం 60 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందలేదు. ప్రస్తుతం కీలకమైన దశలో ఉన్న పంటకూ నీరు అందని పరిస్థితి నెలకొంది. వంశధార క్యాచ్‌మెంట్ ఏరియాలోనూ వర్షాల్లేకపోవడంతో, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇన్‌ఫ్లో వెయ్యి నుంచి 1100 క్యూసెక్కులకు పడిపోయింది. గతేడాది ఇదే సీజన్ నాలుగు వేల క్యూసెక్కుల వరకు నీటి ప్రవాహం ఉండేది. కాలువల్లోకి నీరు విడిచిపెట్టాలంటే కనీసం 2,750 క్యూసెక్కులు ఉండాలి. దీంతో హిరమండలం రిజర్వాయర్‌లో ఉన్న కొద్దిపాటి నీటిని 19 మండలాలకు గానూ ఆరేడు మండలాలకు నీరందిస్తున్నారు. అదీ ఎన్ని రోజులు విడిచిపెడతారో తెలియని పరిస్థితి నెలకొంది. హిరమండలం రిజర్వాయర్‌లో ఉన్న నాలుగు టిఎంసిల నీటి నిల్వలకు గానూ ఇప్పటివరకు 1.50 టిఎంసిల నీరు వదిలారు. డెడ్ స్టోరేజీ కింద రెండు టిఎంసిలు ఉంచాల్సి ఉంది. దీంతో మరో 0.5 టిఎంసిల నీటినే విడిచిపెట్టే అవకాశం ఉంది.
నాగావళిలో జీరో ఇన్‌ఫ్లో
నాగావళిలో ప్రస్తుతం ఇన్‌ఫ్లో జీరోగా ఉంది. నాగావళి నదిపై తోటపల్లి, మడ్డువలస, నారాయణపురం ఆయకట్టు ఆధారపడి ఉంది. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా పాత ఆయకట్టు ద్వారా 30 వేల ఎకరాలు ఉంది. మడ్దువలస ద్వారా ఆరు వేల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. ఖరీఫ్‌లో రెండింటికీ కలిపి 30 వేల ఎకరాల వరకే నీరందిగలిగారు. ప్రస్తుతం నదిలో ఇన్‌ఫ్లో ఏమీ లేకపోవడంతో, చివరి తడులకు నీరందని పరిస్థితి నెలకొంది. తోటపల్లి, మడ్డువలస నుంచి కొంతమేర నీటిని జిల్లా పరిధిలోని ఆయకట్టుకు విడిచిపెడుతున్నారు. ఒడిశాలో వర్షాలు లేకపోవడంతో, వాటిలోనూ నీటిమట్టం నిల్వలు తగ్గిపోతున్నాయి. తోటపల్లి బ్యారేజీ నీటి సామర్థ్యం 2.51 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 1.75 టిఎంసిల నీరే ఉంది. మడ్డువలస రిజర్వాయర్ నీటి సామర్థ్యం 3.37 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 1.3 టిఎంసిలకు పడిపోయింది. జిల్లా అవసరాలకు నీటిని విడిచిపెడుతుండడంతో, తమ ప్రాంత రైతులు ఇబ్బందులు పడతారంటూ విజయనగరం జిల్లా అధికారులు ప్రస్తుతం ఇప్పటివరకు విడిచిపెడుతున్న నీటినీ ఆపేశారు.
నాలుగు ఎకరాలు ఎండిపోయింది
నేను ఆరు ఎకరాల్లో వరి వేశాను. వర్షాలు లేకపోవడంతో నాలుగు ఎకరాలు ఎండిపోయింది. వంశధార కాలువల్లో నీరు లేకపోవడంతో ఇంజిన్లు పెట్టి పొలాన్ని తడిపాను. రెండు ఎకరాలే బతికింది. నాలుగు ఎకరాలకు రూ.50 వేల వరకు ఖర్చు చేశాను. పంట పోవడంతో నష్టపోయాను. కరువు మండలంగా ప్రకటించి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.
- బి.ధనుంజయరావు, నౌగాం, నందిగాం మండలం
ప్రభుత్వం ఆదుకోవాలి
నాలుగు ఎకరాల్లో వరి వేశాం. వర్షాల్లేక పంట ఎండిపోతోంది. చివరి తడులకు నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇంజిన్లు పెట్టి పంట తడుపుతున్నాం. ఈ సంవత్సరం చాలా మదుపులు ఆయ్యాయి. పంట చేతికి వస్తుందో, లేదో తెలియదు. పంట నష్టపోయిన రైతలకు ప్రభుత్వం సాయమందించాలి.
- టెంక సూర్యనారాయణ, చెల్లాయివలస, పోలాకి మండలం