
బ అకాల వర్షాలకు నీట మునిగిన పంట
బ రక్షించుకునేందుకు రైతుల నానా అగచాట్లు
ప్రజాశక్తి-బుచ్చయ్యపేట
అన్నదాత చేతికి పంట వచ్చే వరకు నమ్మకం ఉండదనడానికి ఈ ఫోటోల్లో పరిస్థితే నిదర్శనం. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు పంటలు సాగు చేయగా, అకాల వర్షాలు, ప్రకృతి వైఫరీత్యాలు ఆ పంటలను దెబ్బతీస్తున్నాయి. సోమ, మంగళ వారాల్లో కురిసిన వర్షాలకు మండలంలోని వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ఆ పంటను వదులుకోలేక ఏదో విధంగా కొంత పంటనైనా దక్కించుకుందామన్న ఉద్దేశంతో కూలీలను పెట్టి నీట మునిగిన వరి పంటను ఒడ్డుకు తెచ్చారు. చెక్కలు, మంచాలపై కొట్టి ధాన్యాన్ని సేకరిస్తున్నారు.
బుచ్చయ్యపేట మండలం, కస్పా పరిధిలోని వడ్డాది, విజయరామరాజుపేట, చిన్నప్పన్నపాలెం, పోలేపల్లి, చోడవరం మండలం బెన్నవోలు, గౌరీపట్నం గ్రామాల రైతులు సుమారు 200 ఎకరాలకు పైగా భూముల్లో రబీ సాగులో భాగంగా వరి పంట వేశారు. ప్రస్తుతం ఆ పంట కోత దశకు వచ్చింది. సుమారు 50 నుండి 60 ఎకరాలకు పైగా భూముల్లో వరి పంట పూర్తిగా పండడంతో ఆదివారం కోతలు కోసి పంటను పొలాల్లో ఆరబెట్టారు. అయితే సోమ, మంగళవారాల్లో భారీ వర్షం కురవడంతో కోత కోసిన పొలాల్లో నీరు చేరడంతో వరి పనలు నీటములుగాయి. దీంతో ఆందోళన చెందిన రైతులు నీట మునిగిన వరి పంటను ఒడ్డుకు చేర్చి, చెక్కలు, మంచాలపై కొట్టి వరి ధాన్యాన్ని రక్షించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో ఎకరాకు రూ.25 వేలు నుండి రూ.30వేలు వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతులు తెలిపారు. మండలంలోని చిన్నప్పన్నపాలెం గ్రామానికి చెందిన రైతు దొండ వెంకటరమణ మాట్లాడుతూ తను రెండు ఎకరాలకు పైగా వేసిన వరి పంట మొత్తం నీట మునిగిపోయిందని వాపోయాడు. కొల్లివలస నాగరాజు, సిరసపల్లి వాసు, సిరసపల్లి నానాజీ, పోతు అప్పారావు, ముమ్మిన సూర్యనారాయణ తదితరులకు చెందిన వరి పంట కూడా నీట మునిగిపోయింది. పంట నీటమునిగి తడిసిపోవడంతో ధాన్యం రంగు మారే అవకాశం ఉందని, ప్రభుత్వం ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, నష్ట పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.