Sep 09,2023 00:09

కుముందానుపేటలో దుక్కుదున్ను రైతు

ప్రజాశక్తి- వడ్డాది: గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆశలు చిగురి స్తున్నాయి. ఇటీవల కాలంలో వర్షాభావంతో వరి పంటలు వేయలేక ఆశ నిరాశగా మారింది. ఈ సీజన్లో వరి విత్తనాలు నారు మడులు తయారుచేసి రైతులు సిద్ధంగా ఉన్నప్పటికీ వర్షాలు లేకపోవడంతో సాగు పనులు చేపట్టడం మానుకున్నారు. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా అడపా దడపా కురుస్తున్న వర్షాల కారణంగా రైతుల్లో మళ్ళీ ఆశలు చిగురించింది. వరి పంటలు ఆలస్యం అయినప్పటికీ బంగారు మెట్ట, ఎల్బీపీ అగ్రహారం, వడ్డాది, లోపూడి, చిన్నప్పన్నపాలెం, పొట్టిదొర పాలెం, మంగళాపురం, కుముందానుపేట, విజయరామరాజుపేట తదితర గ్రామాల్లో వరి నాట్లు మొదలుపెట్టారు. నీటి ప్రాంతాల్లో ముందుగా వారినాట్లు వేసినప్పటికీ చెరువుల్లో నీరు లేక రైతులు నిరాశ చెందారు. చాలా మంది రైతులు వరి నారు మళ్లు దమ్ములు తయారు చేసి నీరు లేక వాటిని అలానే ఉంచేశారు. కానీ కొంతమంది రైతులు వేరే మార్గం లేక మళ్ళీ ఇటీవల కురుస్తున్న వర్షాలతో వరి నాట్లను ఆరంభించారు.
కోటవురట్ల:తీవ్ర వర్షం బావ పరిస్థితి ఎదుర్కొంటున్న మండలంలో బుధ, గురు వారాలు కురిసిన తేలికపాటి వర్షానికి మండలంలో మందకొడిగా వరినాట్లు కొనసాగుతున్నాయి. ప్రధానంగా వరాహ, సర్ప నదులు నేటికీ పూర్తిస్థాయిలో ప్రవహించక పోవడంతో ఆయా ప్రాంత రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా తాండవ నీరు పూర్తిస్థాయిలో మండలానికి చేరుకోక పోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే తాండవ కాలువ ఆయకట్టు రైతులు సరుగుడు సాగుకై మొగ్గు చూపుతున్నారు.