Oct 18,2023 21:13

ఆటోజాతాలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యు ఓ.నల్లప్ప

          ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం    నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకూ సాగునీరు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఓ.నల్లప్ప డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ఆటోజాతాను బుధవారం మండల కేంద్రంలో ప్రారంభించారు. మండల కేంద్రం నుంచి ప్రారంభమైన జాతా సిద్ధరాంపురం, దండువారుపల్లి, ఏడావులపర్తి, ఓబుళాపురం, కొండాపురం, రేకులకుంట, అమ్మవారిపేట, రెడ్డిపల్లి, రోటరీపురం, కొర్రపాడు, నీలారెడ్డిపల్లి, వెంకటాపురం, దయ్యాలకుంటపల్లి, బయన్నపేట గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో విరివిగా ఉపాధి పనులు కల్పించాలని, విద్యుత్‌ ఛార్జీలను తగ్గించి, వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపును ఉపసంహరించుకోవాలన్నారు. మండల కేంద్రంలో అంబేద్కర్‌ భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని, నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు భూములకు నీరివ్వాలని, సిద్ధరాంపురం, నారాయణప్పకుంట, ఏడావులపర్తి చెరువులను నింపాలని, మండల కేంద్రంలో బాలికలకు ప్రత్యేక ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయాలని, రోడ్డు నిర్వాసితులకు నష్టపరిహారంతోపాటు స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని, వెంకటాపురంలో వెటర్నరీ సబ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని, ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని, భూమి లేని నిరుపేదలకు మూడెకరాలు భూమి ఇవ్వాలని, మండలంలో ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని, సిద్దరాంపురము గొర్రెల పెంపక క్షేత్రాన్ని పునరుద్ధరించాలని, మండలంలో పండ్ల తోటల మార్కెటింగ్‌, రసాల పరిశ్రమలను ఏర్పాటు చేయాలని, వందశాతం డ్రిప్పు, స్ప్రింకర్లను ఇవ్వాలనే తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు వి.శివారెడ్డి, మండల కార్యదర్శి ఆర్‌.కుళ్లాయప్ప, మండల కమిటీ సభ్యులు పుల్లయ్య, చెన్నప్ప, వేణుగోపాల్‌, సంజీవరెడ్డి, వ్య.కా.సం నాయకులు నాగలింగమయ్య, అంబేద్కర్‌ పాఠశాలల పేరెంట్స్‌ అసోసియేషన్‌ జిల్లా నాయకులు చిన్న ఆంజనేయులు, సిపిఎం నాయకులు రాముడు, అంకాలు, గోపీ, తదితరులు పాల్గొన్నారు.