మొదలైన కొత్తలోనూ
కొంత గడిచేదాకా
ఏడుపు మంకుతనం పేచీ
కావలసినవన్నీ సమకూర్చాయి
ఒక్కటి చరిచి
ప్రపంచాన్ని తిప్పుకోగలనన్న
ఉడుకు వయసులో
అంతా పట్టుదలతోనే
అన్నీ కోరినట్టు ఉండాల్సిందే
రెండయ్యాక కొన్ని
నాలుగయ్యాక మరికొన్ని
ఇష్టాలు కాలంలో కలిసిపోయాయి
రెక్కలు అలిసిపోయాక
ఇప్పుడు... కనీసం ఒకటి
కాదుకాదు దానిలో కొంచమైనా
నచ్చినట్టుంటే చాలు
బతుకు నెట్టుకుపోవచ్చని ఆశ
ఏ ఏడుపూ దాన్ని సాధించటానికి
పనికిరావటం లేదు
నిన్ను తయారుచేసినవాళ్ళ నుండీ
తీసుకున్నంత తేలిక్కాదు
నీ సగభాగం నుండీ
నువ్వు తయారుచేసినవాళ్ల నుండీ
తీసుకోవటం - ఏదైనా సరే
కళ్ళేపల్లి తిరుమలరావు
91770 74280