
ప్రజాశక్తి- నందిగామ : శనగపాడు, అనాసాగరం, నందిగామ మాగాణి భూములకు సాగునీరు లేక ఎండిపోతున్న పంట పొలాలకు తక్షణమే శనగపాడు సప్లై ఛానల్ ద్వారా నీరు విడుదల చేయాలని కౌలు రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం నందిగామ మండలం అనాసాగరం, శనగపాడు, నందిగామ గ్రామాల పరిధిలో నీరు లేక ఎండిపోతున్న మాగాణి, పత్తి, మిర్చి పంట పొలాలను రైతు సంఘం నాయకులు పరిశీలించి రైతులతో కలిసి నిరసన తెలిపారు. నెల రోజులుగా శనగపాడు సప్లై ఛానల్ ద్వారా చివర భూములకు సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. మున్నేరు శనగపాడు సప్లై ఛానల్ పరిధిలో సుమారు 2000 ఎకరాలు సాగు విస్తీర్ణం ఉండగా రైతులు 1200 ఎకరాల్లో ఈ ఏడాది పత్తి, మిర్చి, మాగాణి పంటలు సాగు చేసుకుంటున్నారు. నందిగామ అనాసాగరం గ్రామాల పరిధిలో సుమారు 600 ఎకరాలకు పైగా చివర భూములకు నీరు అందటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నందిగామ పట్టణ కార్యదర్శి కట్టారపు గోపాల్, రైతు సంఘాల నాయకులు కర్రీ వెంకటేశ్వరరావు, వాసు, చలమల కొండ, కష్ణ, పలువురు రైతు నాయకులు, రైతులు పాల్గొన్నారు.
శనగపాడు సప్లై ఛానల్ శాశ్వత ప్రాతిపదికన ఆధునీకరించాలి : కౌలు రైతు సంఘం
శనగపాడు సప్లై ఛానల్ ఆధునికరించి తక్షణమే అనాసాగరం, నందిగామ చివరి భూములకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శనగపాడు సప్లై ఛానల్ వద్ద బుధవారం జరుగుతున్న పనులను రైతు సంఘం నాయకులు పరిశీలించారు. శనగపాడు సప్లై ఛానల్ వద్ద పేరుకుపోయిన ఇసుక మేట తొలగింపు పనులను పరిశీలించారు. పనులు దగ్గరుండి చేయిస్తున్న నందిగామ మార్కెట్ యార్డ్ చైర్మన్ మస్తాన్ నందిగామ సొసైటీ అధ్యక్షులు పాములపాటి రమేష్ తో రైతు సంఘం నాయకులు మాట్లాడారు. పనులు త్వరతగతిన పూర్తిచేసి చివరి భూముల వరకు సాగునీరు అందించాలని సూచించారు.