Jan 31,2021 10:26

                                                                                బిర్యానీ

బిర్యానీ

కావాల్సిన పదార్థాలు : బాస్మతిబియ్యం- పావుకిలో, చిక్కుడు కాయలు- పావుకిలో, నూనె- 100 మి.లీ., యాలకులు- నాలుగు, జీలకర్ర- టీస్పూను, దాల్చినచెక్క- చిన్నముక్క, కొబ్బరిపాలు- పావుకప్పు, అల్లంతురుము- టేబుల్‌స్పూను, వెల్లుల్లి తురుము- టేబుల్‌స్పూను, పసుపు- అర టీస్పూను, పలావు ఆకులు- రెండు, ఉప్పు- తగినంత, నిమ్మకాయ- ఒకటి, కొత్తిమీర తురుము- రెండు టీస్పూన్లు, గరంమసాలా- టీస్పూను
 

తయారుచేసే విధానం : ముందుగా బాస్మతి బియ్యం కడిగి ఉంచు కోవాలి. పాన్‌లో నూనె వేసి యాలకులు, జీలకర్ర, దాల్చినచెక్క వేసి వేగించాలి. అందులోనే అల్లం, వెల్లుల్లి, బిర్యానీ ఆకులు వేసి వేగాక, పసుపు వేసి కలపాలి. తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసి వేగాక, బియ్యం వేసి ఓసారి కలపాలి. ఇప్పుడు కొబ్బరిపాలు, సుమారు గ్లాసున్నర నీళ్లుపోసి ఉప్పు వేసి కలపాలి. అందులోనే గరంమసాలా వేసి మూతపెట్టి ఓ రెండు విజిల్స్‌ రానివ్వాలి. తరవాత ఉప్పు సరిచూసి నిమ్మరసం పిండి కొత్తిమీర తురుము చల్లి వడ్డించాలి.

 

                                                                   వడలు

వడలు


కావాల్సిన పదార్థాలు : శనగపప్పు- కప్పు, పచ్చి చిక్కుడుగింజలు- కప్పు, ఎండుమిర్చి- నాలుగు, అల్లం తురుము- టీస్పూను, జీలకర్ర- టీస్పూను, మెంతులు- టీస్పూను, ఉల్లిపాయ- ఒకటి, కొత్తిమీర తురుము- పావుకప్పు, కరివేపాకు తురుము- పావుకప్పు, ఉప్పు- సరిపడా, నూనె- వేయించడానికి తగినంత.


తయారుచేసే విధానం : శనగపప్పుని నాలుగైదు గంటలు నాననివ్వాలి. తర్వాత అందులో ఒలిచిన చిక్కుడుగింజలు, ఎండుమిర్చి, అల్లం, జీలకర్ర, మెంతులు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. అందులోనే కొత్తిమీర, కరివేపాకు తురుము, ఉప్పు, ఉల్లిముక్కలు వేసి కలిపి చిన్న చిన్న వడల్లా చేసుకుని, కాగిన నూనెలో వేయించి తీయాలి.

 

                                                                 పచ్చడి

పచ్చడి

కావాల్సిన పదార్థాలు : చిక్కుడుకాయలు- అరకిలో, కారం- 75 గ్రాములు, ఉప్పు- తగినంత, నూనె- 200గ్రాములు, నిమ్మకాయలు- ఆరు, మెంతులు, ఆవాలపొడి- రెండు టీస్పూన్లు, అల్లంవెల్లులి-రెండు టీస్పూన్లు, పసుపు- అరటీస్పూను.


తయారుచేసే విధానం : పాన్‌లో నూనె వేసి కాగాక ఈనెలు తీసిన చిక్కుళ్లను వేసి వేగించి తీయాలి. వాటిని ఓ వెడల్పాటి గిన్నెలో వేయాలి. ఆ నూనెలోనే అల్లం వెల్లుల్లి వేసి వేగించి దించి చల్లారనివ్వాలి. చిక్కుడుకాయలు పూర్తిగా వేడి తగ్గాక వాటిమీద కారం, మెంతులు, ఆవాలపొడి, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తర్వాత నూనెతో సహా వేగించిన అల్లం వెల్లుల్లి కూడా వేసి కలపాలి. చివరగా నిమ్మకాయరసం పోసి, కలపాలి. ఆరాక సీసాలో పెట్టుకుంటే సరి.

 

                                                                        మటన్‌ కూర

మటన్‌ కూర

కావాల్సిన పదార్థాలు : మటన్‌ - 250 గ్రాములు, చిక్కుడు కాయలు - 100 గ్రాములు, ఉల్లిపాయలు - రెండు (మీడియం సైజు), టమాటాలు - రెండు (మీడియం సైజు), పచ్చిమిరపకాయలు - మూడు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - ఒకటిన్నర టీ స్పూన్‌, చెక్క, లవంగా, యాలకులు- తగినన్ని, పసుపు పొడి - అరస్పూన్‌, కారం - టేబుల్‌ స్పూన్‌, ధనియాల పొడి - టేబుల్‌ స్పూన్‌, నూనె - నాలుగు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - తగినంత, కొత్తిమీర - అరకప్పు.

తయారుచేసే విధానం : ముందుగా చిక్కుడుకాయలు ఈనెలు తీసుకోవాలి. ప్రతి ఒక్క కాయని తెరిచి చూడాలి. అందులో పురుగులు లేవని నిర్ధారించుకోవాలి. ఒక పాన్‌ తీసుకొని అందులో నూనె, చెక్క, లవంగా, యాలకులు, తరిగిపెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను వేయాలి. అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసి వేగనివ్వాలి. తర్వాత మటన్‌ ముక్కలను అందులోనే వేసి బాగా కలియ తిప్పి, మూత పెట్టాలి. మీడియం మంటలో ఐదు లేదా ఏడు నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలియతిప్పి, ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మటన్‌ ముక్కలు మునిగేలా నీరు పోయాలి. కుక్కర్‌లో ఐదు, ఆరు విజిల్స్‌ వచ్చే వరకూ ఉడికించాలి. కొంత సమయం తర్వాత కుక్కర్‌ మూత తీయాలి. అప్పటికి మటన్‌ సగం ఉడికి ఉంటుంది. అందులోనే టమాటాలు, చిక్కుడుకాయలను వేసి బాగా కలియతిప్పాలి. తర్వాత మరలా కుక్కర్‌ మూతపెట్టి, నాలుగైదు విజిల్స్‌ వచ్చిన తర్వాత కూరను బాగా కలపాలి. తర్వాత గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి, స్టౌ ఆపేయాలి.