Aug 21,2023 22:44

హయాతీనగరంలో పర్యటిస్తున్న రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

* రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్‌: 
నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. సోమవారం నగరంలోని హయాతీ నగరం ప్రాంతంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎంతమేరకు అందుతున్నాయో ప్రజలనడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలు సంతోషంగా జీవించాలనే లక్ష్యంతో నాటి పాదయాత్రలో ఇచ్చిన హామీలను సిఎం జగన్‌ నెరవేర్చారని తెలిపారు. ఎన్నికల ముందు చెప్పినవన్నీ అమలు చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. నగరాభివృద్ధికి ఎన్నో పనులు చేపట్టామని తెలిపారు. బ్రిడ్జి నుంచి ఉల్లి గెడ్డ వరకు నాగావళి నది తీరం వెంబడి రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు.
సామాజిక మరుగుదొడ్లు, వార్డులో మిగిలిన సిసి రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అర్బన్‌ ఆస్పత్రిని అన్ని హంగులతో అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. రిమ్స్‌లో 900 బెడ్లు అందుబాటులోకి తెచ్చి, కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దామన్నారు. మార్కెట్‌తోపాటు రూ.10 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. డంపింగ్‌ యార్డు సమస్య పూర్తిగా పరిష్కరించామని వెల్లడించారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ కమిషనర్‌ చల్లా ఓబులేసు, కళింగ కోమటి కార్పొరేషన్‌ చైర్మన్‌ అంధవరపు సూరిబాబు, మున్సిపల్‌ మాజీ చైర్మన్లు మెంటాడ పద్మావతి, పైడిశెట్టి జయంతి, వైసిపి పట్టణ అధ్యక్షులు సాధు వైకుంఠరావు, తారక, అప్పన్న తదితరులు పాల్గొన్నారు.