Sep 23,2023 21:54

చిత్తశుద్ధి ఎంత?

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనను కొదవగాదు అన్నాడు కవి వేమన. కడవడైననునేమి ఖరముపాలు అని కూడా వ్యాఖ్యానించాడు. మండలాల్లో నిర్వహిస్తున్న జగనన్నకు చెబుదాం కార్యక్రమాల సందర్భంగా అచ్చంగా వేమన శతకాలను గుర్తుచేస్తున్నారు ప్రజానీకం. సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేనప్పుడు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నిచేసినా ఏమిటి ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం పేరిట చాలా కాలం క్రితం నుంచి కొనసాగుతున్న గ్రీవెన్స్‌ సెల్‌ కార్యక్రమాన్ని వైసిపి అధికారంలోకి వచ్చాక 'స్పందన'గా పేరు మార్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో దీనిపేరు జగనన్నకు చెబుదాం అంటూ మార్పుచేశారు. పేరు మార్చినా లక్ష్యం ఒక్కటే. ప్రజాసమస్యలు పరిష్కరించే వేదికగానే కొనసాగు తున్నాయి. ఈ సందర్భంగానే జిల్లా కలెక్టర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టిమరీ తమ వద్దకు వచ్చిన అర్జీలు, ఫిర్యాదులకు నిర్థిష్టమైన కాలపరిమితిలో పరిష్కారం చూపుతాముని కూడా చెప్పారు. ఇందులో ప్రతి ఫిర్యాదారుడు లేదా అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా తమ చర్యలు ఉంటాయని కూడా ఉద్ఘాటించారు. మరింతగా ఆశలు పెంచుకున్న ప్రజానీకం వినతులు మండల, జిల్లా స్థాయిలో వెల్లువిరిశాయి. వాటి పరిష్కారం చూపడంలో మాత్రం అధికారులు, ముఖ్యంగా ప్రభుత్వం వెనుకబడింది. ముఖ్యంగా మన జిల్లాలో ప్రతి సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో అందే వినతులపై సంతకాలు చేసి సంబంధిత అధికారులకు పంపడం మినహా వాటిపై పర్యవేక్షణ లేదు. దీంతో, వచ్చినవారే తిరిగి కలెక్టరేట్‌కు పదే పదే వస్తున్నారు. బహుశా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడం, మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రభుత్వం ఇక నుంచి మండల స్థాయిలోనూ జగనన్నకు చెబుదాం అంటూ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించింది. ఇందులో భాగంగానే ఈనెల 13వ తేదీన రాజాంలోనూ, 15న బొబ్బిలిలోనూ, 20న ఎస్‌.కోట, 22న నెల్లిమర్లలోనూ జగనన్నకు చెబుదాం కార్యక్రమాలు నిర్వహించారు. 27న గజపతినగరం, 29న చీపురుపల్లిలోనూ ఇదే కార్యక్రమం నిర్వహించనున్నారు. వీటికి జిల్లాలోని అన్ని శాఖల అధికారులూ కట్టగట్టుకుని వెళ్లారు. ప్రజల వద్దకు వెళ్లడం తప్పుకాదు. కానీ, ప్రజలే జిల్లా కేంద్రానికి వచ్చినప్పుడు పరిష్కరించని సమస్యలు, మండలానికి వచ్చి పరిష్కారం చూపుతామంటే ఎలా నమ్మాలి అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. చివరకు కలెక్టర్‌ ఆదేశాలు తంగలో తొక్కడం, పరిష్కరించకుండానే పరిష్కరించి నట్టు నివేదికలు పంపడం వంటివి కూడా వెలుగులోకి వచ్చాయి. బహుశా ఇందుకేనేమో మండలాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి స్పందన అంతంత మాత్రంగానే ఉంటోంది. ఇటీవల ఎస్‌.కోటలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మొత్తం 54 వినతులు మాత్రమే అందాయి. ఇందులో రెవెన్యూ 24వరకు ఉన్నాయి. దాదాపు ఈ అర్జీలన్నీ ఏడాదికి మించి కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నవారే కావడం విశేషం. హౌసింగ్‌ 13, సాంఘిక సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధికి సంబంధించి 3, వైద్యారోగ్య శాఖ 4, పంచాయతీరాజ్‌ శాఖ 2, ఐసిడిఎస్‌ 2 ఉన్నాయి. మే 9వ తేదీ నుంచి నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఈ మండలం నుంచి మొత్తం 315 వినతులు అందినట్టు అధికారులు చెబుతున్నారు. వీటిలో చాలా వరకు పరిష్కారం చేయకుండానే అర్జీదారులు సంతృప్తి చెందినట్టుగా అధికారులు రికార్డుల్లో నమోదు చేసుకుంటున్నారని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికారులు కూడా తీవ్ర ఒత్తిడి, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మండల స్థాయి అధికారులు చేయాల్సిన పనికి జిల్లా స్థాయి అధికారులు ఎందుకంటూ కక్కలేక మింగలేక అధికారులు లోలోపల మదనపడుతున్నారు. మరోవైపు రోజుకో మండలం, మధ్యమధ్యలో సభలు, సమావేశాలతోనే కాలం గడిచిపోతోందని, శాఖ పరమైన పనులు చేయలేకపో ఒత్తిడికి గురౌతున్నామని కూడా చెబుతున్నారు. మరోవైపు ప్రజానీకం తల్లికి పట్టెడు అన్న పెట్టనివాడు పిన్నమ్మకు బంగారు గాజులు కొంటానని మాటిచ్చినట్టుగా జిల్లా కేంద్రానికి వచ్చినప్పుడే పరిష్కారం చూపలేనివారు మండలాలకు వచ్చి ఏం చేస్తారని జనం చర్చిస్తున్నారు. ఇదంతా ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆడిస్తున్న నాటకం తప్ప చిత్తశుద్ధి లేదన్నది పబ్లిక్‌ టాక్‌.