అన్ని గాయాలూ
చీము నెత్తురులు తెలిసేట్టు సలపరించవు
నుదుటిమీది బొట్టులానో, కాలి వేళ్లకి చుట్టిన మెట్టెలానో
వండుకున్న కూరలానో, వొంటికున్న రంగులానో
గాయం ఎన్నో అవతారాలెత్తిన దేవుడులాంటిది
గుళ్లో విగ్రహంలా దాన్నందరూ చేత్తో ముట్టుకోలేరు
వరి కుచ్చులు కట్టినప్పుడు,
అరణ్యాల నుంచి ఇంటి చూరులోకి
ఎర్ర ముక్కు పిట్టలొచ్చి పొడుచుకు తింటున్నప్పుడు
గింజ పాల రొమ్ములాగ పంటి గాటు పడుతుంది
పంట చేలన్నీ నాగలి కర్రు గుచ్చుకున్నందుకే
విరగ పండి ఉంటాయి
గాయమూ నొప్పీ, తల్లీ బిడ్డల్లాంటివి
నిజానికి
నెగడు సెగలో కాగిన
డప్పుమీది దరువు శబ్దంలో
కొండరాళ్లల్లోంచి సాగిన నీళ్ల గొంతులో
విత్తనం తల పగిలినప్పుడు స్రవించిన పచ్చటిలావాలో
గాయం సకల జన సామాన్య
ఆదిమ మేధో వ్యవహార జ్ఞానమై కన్ను తెరిచింది
గాయం తుమ్మముల్లు దిగిన ఉద్యమం అరికాలు
నలుసుతో ఎర్రబడ్డ పోరాటం కనుగుడ్డు
వొంటి మీద
కర్పూరం హారతి పడుతున్నప్పుడు
నది ముఖం నలిగిన పువ్వై పోతుంది
వేపచెట్లకి, ఆవు గిట్టలకి
బొట్లు పెడుతున్నప్పుడు
వాటి చర్మ రంధ్రాలు గాలాడక పూడుకుపోతాయి
పాలకులకీ గాయం అనాటమీ తెలుసు
దొమ్మీలో, కొట్లాటల్లో, ఒక్కడుగు వెనగ్గా
గాయం, దెబ్బతిన్న పులిలా పొంచి ఉంటుంది
వాళ్లందుకే దాన్ని అరెస్టు చేస్తారు, జైల్లోనూ పెడతారు
ఒకడు బాణమేసినా ఇంకొకడు తుపాకి పేల్చినా
కమిలిన ప్రతి గాయంలోనూ నాకిప్పుడు
ఇరుసులో పడి పెనుగులాడుతున్న
కాలమే కనిపిస్తున్నది
శ్రీరామ్ పుప్పాల
99634 82597