Oct 04,2023 00:37

సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో ప్రథమ బహుమతి పొందిన చిత్రాలు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : గాంధీ జయంతి సందర్భంగా నరసరావుపేటలోని పల్నాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతల వివరాలను నిర్వాహకులు మంగళవారం వెల్లడించారు. విజ్ఞాన కేంద్రం కన్వీనర్‌ షేక్‌ మస్తాన్‌వలి, పోటీల నిర్వాహకులు కట్టా కోటేశ్వరరావు విలేకర్లతో మాట్లాడారు. సబ్‌ జూనియర్స్‌ (3, 4, 5 తరగతులు) విభాగంలో వి.శరణ్య సాయి, కె.వేద, కె.మనస్విని ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందారన్నారు. జూనియర్‌ (6, 7, 8 తరగతులు) విభాగంలో శ్రీదీక్ష కేసాని, డి.యశ్వంత్‌, బి.పావని దుర్గ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు, సీనియర్‌ (9, 10 తరగతుల) విభాగంలో ఎం.శ్యామ్‌ కుమార్‌, జి.నరేంద్ర, బి.క్రినో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారని వివరించారు. వీరితోపాటు ప్రతి విభాగంలోనూ కన్సోలేషన్‌ బహుమతులను ఇవ్వనున్నట్లు చెప్పారు. పాల్గొన్న అందరికీ ప్రశంసా పత్రం ఇస్తామన్నారు. బహుమతుల ప్రదానోత్సవం ఈ నెల 8న ఆదివారం సాయంత్రం 4 గంటలకు స్థానిక ఆక్స్‌ఫర్డ్‌ హైస్కూల్‌ ఆవరణలో నిర్వహిస్తామని, కార్యక్రమానికి ప్రముఖులు హాజరవుతారని తెలిపారు.
పోటీలకు నరసరావుపేట ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారని, మొత్తం 1300 మంది రిజిస్టర్‌ నమోదు చేసుకోగా 1100 మంది పాల్గొన్నారని చెప్పారు. పోటీల నిర్వహణలో 60 మంది ఉపాధ్యాయులు పరిశీలకులుగా వ్యవహరించారని తెలిపారు కార్యక్రమంలో జిసిడిఒ డి.రేవతి, ప్రధానోపాధ్యాయుల సంఘ మాజీ గౌరవాధ్యక్షులు ఎం.ఎస్‌.ఆర్‌.కె ప్రసాద్‌, ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకులు బి.ఎం.సుభాని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారని, న్యాయనిర్ణేతలుగా ప్రముఖ ఆర్టిస్టులు జింకా రామారావు (సత్తెనపల్లి), పి.ప్రసాద్‌ (వినుకొండ), అష్రఫ్‌ అలీ (పల్నాడు కళాక్షేత్రం కోశాధికారి, నరసరావుపేట), స్థానిక ఉపాధ్యాయులు పి.తిరుమలలక్ష్మి, వేదాంతం రాంబాబు, ధారల నాగేశ్వరాచారి వ్యవహరించారని, పోటీలను ఎం.మోహనరావు, ఎం.సాంబశివరావు, ఎ.భాగేశ్వరిదేవి, కె.హనుమయ్య, కరీముల్లా, జిఎస్‌ఆర్‌ పర్యవేక్షించారని వివరించారు. విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికి తీయటానికి ఇటువంటి పోటీలు దోహదం చేస్తాయని, నేటి విద్యా విధానం కేవలం పరీక్షలు,ర్యాంకులు, చదువుల వరకే పరిమితం అవ్వడం వల్ల విద్యార్థుల్లో ఉన్న అనేక నైపుణ్యాలు వెలికి రాకుండా పోతున్నాయని చెప్పారు. పల్నాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులలో నైపుణ్యాలను వెలికి తీయటానికి, అభ్యుదయ భావాలను రేకెత్తించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. దీని కొనసాగింపుగా నవంబర్‌లో పెద్ద ఎత్తున పల్నాడు బాలోత్సవాలు జిల్లా స్థాయిలో నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.