Nov 06,2023 21:39

ప్రజాశక్తి - కాళ్ల
              అందంగా బొమ్మలు గీసి రంగులు అద్ది తమ ప్రతిభను చాటుతున్నారు విద్యార్థినులు. పాఠశాలలో విద్యార్థులు వివిధ చిత్రాలతో ఆకట్టుకున్నారు. చిన్నారులు గ్రామీణ వాతావరణం, పర్యావరణం, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్‌ నిషేధం అంశాల్లో బొమ్మలను గీస్తూ ఆకట్టుకుంటున్నారు. బాలల మానసిక వికాసానికి, విద్యాభ్యాసం ద్వారా ఉన్నత శిఖరాలకు ఎదగడానికి కళలు ౖఅవకాశం కల్పిస్తాయి. చిత్ర లేఖనం పోటీలు వంటివి పిల్లల్లో కళల పట్ల అంతర్లీనంగా ఉన్న సృజనాత్మకతను, శక్తిని బయటకు తీయడానికి ఎంతో అవసరం. విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం ద్వారా ప్రతిభావంతులుగా తయారవుతారన్నారని ఇద్దరు అక్కాచెల్లెలు నిరూపించారు.
విద్యార్థులు, బాల బాలికల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి అడవి బాపిరాజు స్మారకోన్నత చిత్రలేఖనం బాలోత్సవం ఇటీవల భీమవరంలో చింతలపాటి బాపిరాజు హైస్కూల్లో నిర్వహించారు. సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ కేటగిరీల్లో చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. కాళ్ల గ్రామానికి చెందిన మేక ప్రణతి జూనియర్‌ విభాగంలో ప్రథమ బహుమతి, మేక నాగసాయి లక్ష్మీప్రసన్న సీనియర్‌ కేటగిరీలో నాలుగో బహుమతి సాధించింది. మేక మహంకాళి (కాళి చరణ్‌), గీత దంపతుల కుమార్తెలు నాగసాయి లక్ష్మీప్రసన్న, ప్రణతిలు చిత్రలేఖనం పోటీలో ప్రతిభ చూపారు. నాగసాయి లక్ష్మీప్రసన్న పదో తరగతి, ప్రణతి నాలుగో తరగతి భీమవరంలో భారతీయ విద్యా భవన్‌ స్కూల్లో చదువుతున్నారు. మేక ప్రణతి 4, 5, 6వ తరగతుల మధ్య నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో పాల్గొంది. వివిధ స్కూళ్ల నుంచి వచ్చిన విద్యార్థులు 2,300 మంది చిత్రలేఖన పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలో మేక ప్రణతి మంచి ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి దక్కించుకుంది. 7, 8, 9, 10 తరగతులకు సంబంధించి పర్యావరణ పరిరక్షణ అంశంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మేక నాగసాయిలక్ష్మీప్రసన్న ప్రతిభ చూపి నాలుగో బహుమతి సాధించింది. డిఇఒ ఆర్‌వి.రమణ చేతులమీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలను అందించారు. చిన్నారులను ప్రోత్సహిస్తున్న విద్యార్థినుల తల్లిదండ్రులను, స్కూల్‌ టీచర్స్‌ను పలువురు అభినందించారు.