Oct 03,2023 00:59

ప్రజాశక్తి -పల్నాడు జిల్లా : గాంధీ జయంతి సందర్భంగా పల్నాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన చిత్రలేఖనం పోటీలకు విశేష స్పందన లభించింది. నరసరావుపేట నియోజకవర్గంలోని నరసరావుపేట పట్టణం, మండలం, రొంపిచర్ల మండలంలతోపాటు సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలంలోని పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 1300 మందికి పైగా పాల్గొన్నారు. పోటీలను విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు యు.వి.రామరాజు, పోటీల కన్వీనర్‌ కట్టా కోటేశ్వరరావు, విజ్ఞాన కేంద్రం కార్యనిర్వాహక కన్వీనర్‌ షేక్‌ మస్తాన్‌వలి, విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు కె.రామారావు, డి.శివకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా కట్టా కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు, పోటీ తత్వం అలవర్చేందుకు పోటీలు నిర్వహించామని చెప్పారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు జాతిపిత మహాత్ముని చిత్ర లేఖనంపై పోటీ నిర్వహించగా 6, 7, 8 తరగతుల విద్యార్థులు మతసామరస్యం ఉట్టిపడేలా చిత్ర లేఖనం పోటీలు పెట్టామని, 9,10 తరగతుల విద్యార్థులకు గాంధీజి గ్రామ స్వరాజ్యం ఉట్టిపడే బొమ్మలు వేయించామని వివరించారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేస్తామని, పాల్గొన్న అందరికీ ప్రశంసా పత్రం అందిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా పోటీల పర్యవేక్షణకు ఇన్విజిలేటర్లుగా పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు 60 మందికి పైగా పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ ఆర్టిస్టులు జింకా రామారావు, బి.ప్రసాద్‌, ప్రముఖ చిత్రలేఖన ఉపాధ్యాయులు టి.తిరుమల లక్ష్మి, పల్నాడు కళాక్షేత్రం ట్రెజరర్‌ అష్రఫ్‌ అలీ, వేదాంతం రాంబాబు, డి.నాగేశ్వరరావు వ్యవహరించారు. విజేతల వివరాలను మంగళవారం విడుదల చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. చిత్రలేఖనం పోటీలకు సహాయ సహకారాలు అందించిన కృష్ణ చైతన్య కళాశాల డైరెక్టర్‌ కొల్లి బ్రహ్మయ్య, ఆక్స్‌ఫర్డ్‌ విద్యాసంస్థల డైరెక్టర్‌ రాజారెడ్డికి విజ్ఞాన కేంద్రంద నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.