Sep 23,2023 20:48

ప్యాపిలి మార్కెట్‌కు వచ్చిన టమోటా

చితికిపోతున్న టమోటా రైతు
- ప్యాపిలి మార్కెట్లో భారీగా ధర పతనం
- 25 కిలోల బాక్స్‌ ధర రూ. 50 నుంచి 75 లోపే
- గిట్టుబాటు ధర లేక అప్పులపాలవుతున్న రైతన్న
ప్రజాశక్తి -ప్యాపిలి

       టమోటా ధరల పతనం కొనసాగుతూనే ఉంది. దీంతో రైతులు దిక్కుతోచక ఆందోళన చెందుతున్నారు. ప్యాపిలి మార్కెట్‌లో టమోటా ధర కిలో 2, 3 రూపాయలు మాత్రమే పలుకుతుండడంతో రైతులు కోత కూలీలు రావడం లేదు. టమోటాకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో వాటిని పొలాల్లో అలాగే వదిలేస్తున్నారు. మరికొందరు మార్కెట్‌కు తీసుకెళ్లే ఖర్చులు కూడా రావడం లేదని పారబోస్తున్న పరిస్థితి నెలకొంది. పంట చేతికి వచ్చేసరికి ధర పడిపోవడంతో పెట్టిన పెట్టుబడి రాక రైతులు అప్పలపాలై తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 14 వేల ఎకరాల్లో టమోటా పంటను రైతులు సాగు చేశారు. ప్యాపిలి మండలంలో 3,665 ఎకరాలలో రైతులు పంటను సాగు చేశారు. పంట సాగుకు ఎకరాకు దాదాపు రూ. 30 వేల నుంచి 40 వేల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. నెలన్నర క్రితం ఆకాశాన్నంటిన టమోటా ధరను చూసి రైతులు ఎంతో సంతోష పడ్డారు. అయితే ప్రస్తుతం టమోటా ధర పూర్తిగా పడిపోవడంతో దిగాలు చెందుతున్నారు. ప్యాపిలి మార్కెట్‌కు భారీగా టమోటా సరుకు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌కు రోజుకు దాదాపు 15 వేల బాక్సుల వరకు టమోటాలు వస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు రాకపోవడంతో టమోటా ధర ఒక్కసారిగా పడిపోయింది. 25 కిలోల టమోటా బాక్స్‌ ధర రూ. 50 నుంచి 75లోపే పలుకుతుండడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. నెలన్నర్ర కిందటి వరకు క్వింటాళ్ల కొద్ది టమోటాలు తీసుకొచ్చి సంచులతో డబ్బులు తెచ్చుకున్న రైతులు నేడు ఖాళీ జేబులతో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జూన్‌ రెండో వారం నుంచి టమోటా ధర ఒక్కసారిగా వంద రూపాయలకు పైగా పెరిగింది. గత రెండు వారాల నుంచి టమోటా ధర నేలచూపులు చూస్తుండడంతో రైతులు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మూడు నెలల పాటు సామాన్యులకు కన్నీళ్లు పెట్టించిన టమోటా నేడు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. ప్రస్తుతం టమోటాను మార్కెట్‌కు తెస్తే కనీసం రవాణా చార్జీలు, పంట కోత కూలీలు కూడా రావడం లేదు. పంటను రోడ్డుపై పారబోసే పరిస్థితి నెలకొంది. టమోటా రైతులను ఆదుకునేందుకు ప్రాసెసింగ్‌ యూనిట్‌, జ్యూస్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గతంలో అనేక హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి దాదాపుగా నాలుగున్నర్ర సంవత్సరాలు దాటినా వాటి అమలు దిశగా ఒక్క అడుగు పడలేదు. ఇప్పటికైనా టమోటా జ్యూస్‌ పరిశ్రమను ఏర్పాటు చేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

రవాణా ఖర్చులు కూడా రావడం లేదు
రైతు కంబగిరి, హెచ్‌ఆర్‌ పల్లి గ్రామం.
మార్కెట్‌లో 25 కిలో టమోటా బాక్స్‌ ధర వంద రూపాయలకు దరిదాపులకు కూడా రావడం లేదు. పంట కోత కూలీలు, రవాణా ఖర్చులు సైతం రావడం లేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు టమోటా జ్యూస్‌ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలైనా ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదు. జ్యూస్‌ పరిశ్రమను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి.

అప్పుల పాలవుతున్నాం
రైతు వెంక్రట్రాముడు, కలుచట్ల గ్రామం.
టమోటా పంటకు గిట్టుబాటు ధర లేక విలవిలలాడుతున్నాం. పెట్టిన పెట్టుబడులు రాక అప్పుల పాలవుతున్నాం. ప్యాపిలి మండలంలో టమోటా ఎక్కువగా పండించే రైతులు ఉన్నారు. జ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. గతంలో సిఎం పాదయాత్రలో జ్యూస్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామన్నారు. కావున జ్యూస్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి టమోటా రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.