Aug 16,2023 23:22

చిరుత సంచారంపై అప్రమత్తంగా ఉండండి : వీసీ
ప్రజాశక్తి - క్యాంపస్‌
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చిరుత సంచరిస్తుందనే వార్తల నేపథ్యంలో విసి ఆచార్య కె.రాజారెడ్డి ఎస్వియూ అధికారులతో సమావేశమై తీసుకోవలసిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఎస్వియూలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, వార్డెన్లు , ఇంజనీరింగ్‌ అధికారులతో ఈ అంశంపై చర్చించారు. తితిదే. లాగా కట్టుదిట్టమైన ఏర్పాట్లకు సిద్ధం కావాలని చెప్పారు. విద్యార్దులకు, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించమని అధికారులను కోరారు. చీకటి ప్రాంతాల్లో లైటింగ్‌ వేయడం, పొదలను తొలగించడం వంటి పనులు చేయాల్సిందిగా యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ విభాగాన్ని ఆదేశించారు. జిల్లా అటవీశాఖ అధికారితో ఫోన్‌లో మాట్లాడి పులులు రాకుండా చర్యలు తీసుకోమని కోరారు. బోన్లు ఏర్పాట్లు చేయమని అన్నారు. యస్వీయూ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రక్షక వాహనాన్ని రాత్రి సమయాల్లో తిరిగేలా సంబంధిత అధికారులకు లేఖలు పంపే ఏర్పాటు చేశారు. హాస్టల్స్‌ లో వ్యర్థభోజన పదార్థాలకోసం వచ్చే కుక్కలు , ఆ కుక్కల కోసం వస్తున్న పులుల విషయమై జాగ్రత్త వహించాలని కోరారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్‌ ఆచార్య మహమ్మద్‌ హుస్సేన్‌ ఆచార్య పద్మనాభం, ఆచార్య తులసీ రామకష్ణారెడ్డి, ఆచార్య ఆర్విఎస్‌ సత్యనారాయణ, ఆచార్య పద్మావతి, ఆచార్య శ్యామ్మోహన్‌ డేవిడ్‌ రాజు, ఆచార్య దామోదర్‌ రెడ్డి, ఆచార్య వెంకటేశ్వర్లు, డా. బాలాజి, ఇంజనీర్‌ తాండవకష్ణ తదితరులు పాల్గొన్నారు.
చిరుత కలకలంపై యూనివర్సిటీలో దిశానిర్దేశం