Sep 20,2023 23:46

ప్రజాశక్తి - బాపట్ల
చిరుధాన్యాలతో తయారుచేసిన పదార్థాల ఆహారంతోనే మెరుగైన ఆరోగ్యమని జిల్లా విద్యాశాఖ అధికారి పివిజే రామారావు అన్నారు. పట్టణంలోని ఏబీఎం హై స్కూల్ ఆవరణలో చిరుధాన్యాలు పౌష్టికాహారమా! ఆహార వ్యామోహమా! అనే అంశంపై జిల్లా స్థాయిలో విజ్ఞాన సదస్సు బుధవారం ఏర్పాటు చేశారు. సదస్సుకు బాపట్ల జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. సదస్సులో పాల్గొన్న విద్యార్థుల్లో ఇంకొల్లు మండలం గంగవరం ఎస్‌వికే హై స్కూలు విద్యార్థిని పి అంకిత ప్రథమ స్థానాన్ని కైవశం చేసుకుందని తెలిపారు. కర్లపాలెం మండలం చింతాయపాలెం జెడ్‌పి ఉన్నత పాఠశాల విద్యార్థిని పి శైలుశ్రీ ద్వితీయ, అద్దంకి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల   విద్యార్థిని కె షణ్ముఖప్రియ తృతీయ స్థానంలో నిలిచారని తెలిపారు. జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని ఈనెల 25న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి సదస్సుకు హాజరవుతారని తెలిపారు. పోటీల్లో బహుమతులు పొందిన విద్యార్థులను డిఈఓ రామారావు, బాపట్ల ఎంఇఒ నిరంజన్, డి ప్రసాదరావు, జిల్లా సైన్స్ అధికారి  ఎండి సాదిక్ అభినందించారు.
ఇంకొల్లు : బాపట్ల ఏబిఎం స్కూల్‌లో జిల్లా స్థాయి సైన్స్‌ సెమినార్‌ బుధవారం జరిగింది. సెమినార్‌లో ఇంకొల్లు మండలం గంగవరం శ్రీ వలేటి కృష్ణయ్య ఉన్నత పాఠశాల విద్యార్ధిని పెనపల్లి అంకిత జిల్లా స్ధాయిలో ప్రధమ బహుమతి సాధించింది. రాష్ర్ట స్ధాయి పోటీలకు ఎంపికైంది. 8వ తరగతి చదువుతున్న అంకిత చిరుధాన్యాలు పౌష్టికాహారమా లేక ఆహార వ్యామోహమా అనే అంశంపై ప్రసంగించింది. ఈ సందర్భంగా అంకితను పాఠశాల హెచ్‌ఎం కె వీరాంజనేయులు, సైన్స్‌ ఉపాధ్యాయిని ఎం సుమతి అభినందించారు.