ప్రజాశక్తి- అనకాపల్లి
జిల్లాలో చిరుధాన్యాల ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిశోధన సహ సంచాలకులు డాక్టర్ పివికె.జగన్నాధ రావు అన్నారు. స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్‌లో గురువారం జరిగిన శిక్షణ, సందర్శన కార్యక్రమంలో ఆయన ముఖ్య వక్తగా మాట్లాడారు. 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని రైతులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు కృషి చేయాలని కోరారు. ఆహార ధాన్యాల్లో చిరుధాన్యాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలన్నారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల వ్యవసాయ అధికారులు అపల స్వామి, మోహన్ రావు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. రబీ సీజన్లో వరి, అపరాలు, చిరుధాన్యాలు అధిక ఉత్పత్తికి కృషి చేయాలన్నారు పలువురు వ్యవసాయ సహాయ సంచాలకులు మాట్లాడుతూ జిల్లాలో రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆత్మ పిడి ఆశాదేవి మాట్లాడుతూ చెరకు వంటి పంటలలో యాంత్రికరణ ప్రోత్సహించి, రాగి వేరుశనగ వంటి పంటల్లో ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం పంటల క్షేత్రస్థాయి సమస్యలపై కెవికె, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, ఏరువాక శాస్త్రవేత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు ముకుందరావు, భవాని, విశాలాక్షి, ఆదిలక్ష్మి, సరిత, శ్రీదేవి, రామలక్ష్మి, కుసుమ, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










