Mar 19,2023 00:02

అవగాహన కల్పిస్తున్న అధికారులు

ప్రజాశక్తి -నక్కపల్లి :రైతులు వేసవి దుక్కులు చేపట్టి చిరుధాన్యాల సాగు చేపట్టాలని వ్యవసాయ సహాయ సంచాలకులు టిఎస్‌ రాజ్‌ కమల్‌ సూచించారు. మండలంలో శనివారం వ్యవసాయ అధికారి ఉమా ప్రసాద్‌ ఆధ్వర్యంలో కాగిత, దేవవరం గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా పంట పొలాలను సందర్శించారు. వేసవి దుక్కులు, అపరాలు -చిరుధాన్యాల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. వేసవి దుక్కులు చేపట్టి చిరుధాన్యాలైన ఊదలు, గంట్లు, రాగులు సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. నీటి ఎద్దడిని తట్టుకుంటూ కేవలం 250-400మి.ల్లీ వర్ష పాతం సరిపోతుందని, ఎరువులు, పురుగు మందులు అవసరం కూడా ఉండదని తక్కువ పెట్టుబడితో అపరాలు సాగు చేయవచ్చునని తెలిపారు. అపరాలు, చిరుధాన్యాలు ఆరోగ్య పరంగా కూడా ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. మధు మేహం, గుండె జబ్బులు వున్న వారికి ఈ ఆహారం ఔషదంగా ఉపయోగ పడుతుందన్నారు. అపరాలు, చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సత్యనారాయణ, ఆర్‌బికే సిబ్బంది పాల్గొన్నారు.