Jun 28,2023 00:38

మాట్లాడుతున్న జెసి శ్యామ్‌ప్రసాద్‌

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : కంది, రాగుల పంటలతో అధిక దిగుబడి సాధ్యమని పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అన్నారు. మండలంలోని పందిటివారిపాలెంలో మంగళవారం నిర్వహించిన కంది, రాగి పంట విస్తీర్ణంపై అవగాహనలో జెసి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2023ను జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందని, రాగి, కొర్ర, వరిగ, సజ్జ, జొన్న మొదలైన పంటలను అధిక విస్తరణలో సాగు చేయాలని కోరారు. కంది, రాగి విత్తన సంచులను సబ్సిడీపై రైతులకు అందజేశారు. జిల్లాలో ఈ సంవత్సరం లక్ష మెట్రిక్‌ టన్నులు కంది విత్తనాలను రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. పందిటివారిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకొని క్షేత్రస్థాయిలో వ్యవసాయ కార్యక్రమాలన్నీ పరిశీలిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా ఈ సంవత్సరం 70 ఎకరాల్లో రాగులు, 375 ఎకరాల్లో జొన్న, 300 ఎకరాల్లో సజ్జలు, 375 ఎకరాల్ల వరిగ, 150 ఎకరాల్లో కొర్రలు, 62,500 ఎకరాల్లో కంది సాగును లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. కంది ఎల్‌ఆర్‌ జి52 విత్తనాలను నూరుశాతం రాయితీపై ఆర్‌బికెల ద్వారా పంపిణీ చేస్తామని తెలిపారు. జులై ఒకటో తేదీ నుండి పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. రైతులంతా తమ పంటలను ఈ-క్రాప్‌లో నమోదు చేసుకోవాని సూచించారు. శాస్త్రవేత్త వరప్రసాద్‌ మాట్లాడుతూ కందిలో పూతరాలిపోకుండా పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. జిల్లా ట్రైనింగ్‌ కో-ఆర్డినేటర్‌ శివకుమారి మాట్లాడుతూ రైజోబియం కల్బర్‌తో విత్తన శుద్ధి ప్రయోజనాలు, కందిలో ఆకుచుట్ట పురుగు, పూతదశలో ఆశించి పురుగులు నివారణ చర్యలు వివరించారు. సర్పంచ్‌ టి.చినాంజనేయులురెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీకృష్ణదేవరాయలు, ఏవో శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
రీసర్వేపై పరిశీలన
పిడుగురాళ్ల తహశీల్దార్‌ కార్యాలయాన్ని జెసి సందర్శించారు. రీసర్వేను పరిశీలించి వేగవంతానికి ఆదేశించారు. జులై 15 నాటికి క్రింది స్థాయిలో పనులు పూర్తిచేసి జులై 31 నాటికి డ్రాఫ్ట్‌ ల్యాండ్‌ రికార్డు నమోదు చేయాలన్నారు. రీసర్వే చేసే క్రమంలో భూ యజమానులకు అందరికీ వ్యక్తిగతంగా సర్వే నోటీసులు ఇవ్వాలని, గత ఎఫ్‌ఎంబిలో నమోదైన కొలతల మేరకు నిర్ధారించి కొత్త రికార్డులు నమోదు చేయాలని నిర్దేశించారు. ప్రస్తుతం జిల్లాలో రెండో దశలో 80 గ్రామాలను రీసర్వే నిర్వహిస్తుండగా మొత్తం విస్తీర్ణం 3,25,430 ఎకరాలలో 2,55,000 ఎకరాలు పూర్తి చేశామని, 70,000 ఎకరాలు రీసర్వే చేయాల్సి ఉందని తెలిపారు. రోజుకు 3,500 ఎకరాలు చొప్పున జూలై 15 నాటికి పూర్తి చేయాలన్నారు. రికార్డులు మొత్తం ఆగస్టు 31కు పూర్తిచేయాలన్నారు. ఇదిలా ఉండగా రీసర్వేపై సత్తెనపల్లిలో ఆర్‌డిఒ కార్యాలయంలో తహసిల్దార్లతో జేసీ సమీక్షించారు. ఆర్డీవో బిఎల్‌ఎన్‌ రాజకుమారి, సత్తెనపల్లి, అమరావతి, పెదకూరపాడు, అచ్చంపేట తహశీల్దార్లు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.