![](/sites/default/files/2023-11/pcpt%20ao.jpg)
ప్రజాశక్తి - పాచిపెంట : అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023ను పురస్కరించుకొని చిరుధాన్యాలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని మండల వ్యవసాయాధికారి కె.తిరుపతిరావు అన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేపడుతున్న రైతులు దళారులను నమ్మకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు పంపిస్తే మంచి మద్దతు ధర వస్తుందని, అన్ని రకాల చిరుధాన్యాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. మండలంలోని శతాబి, తంగలం, మూటకూడు గ్రామాల్లో పంటలను పరిశీలించిన అనంతరం రైతులతో మాట్లాడారు. రాగులు క్వింటాకు రూ.3846, తెల్లజొన్న క్వింటా రూ.3225 మద్దతు ధర ఉందని రైతులు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాల ద్వారానే అమ్మకాలు జరిగేలా చూసుకోవాలని గ్రామ వ్యవసాయ సహాయకులంతా ఈ విషయాలను రైతులకు తెలియజేయాలని తెలిపారు. శతాభి గ్రామ సర్పంచి శిలపజన్మి రామయ్య మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల వల్ల ఎకరాకు నాలుగు క్వింటాళ్లు రావాల్సిన చోడి దిగుబడి 1.5 క్వింటాళ్లు మాత్రమే వస్తుందని రాబోయే ఖరీఫ్ సీజన్‌లో చిరుధాన్యాలు అధిక సాగు, ఉత్పత్తికి ప్రోత్సహించాలని అన్నారు. ప్రకృతి సేద్య సిబ్బంది ద్వారా మరింత ప్రోత్సహించాలని, ధర కూడా ఎక్కువగా ఉండేలా చూడాలని కోరారు. అలాగే కాఫీ పంటల సాగు లాభదాయకంగా ఉందని, దీన్ని కూడా ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు కిరణ్ కుమార్, ప్రకృతి సేద్య ఎల్ టు సి ఆర్ పి సురేష్ కుమార్, రైతులు పాల్గొన్నారు.