చిరు వ్యాపారులకు వరం 'జగనన్న తోడు'
- 17,691 మందికి రూ. 45.90 లక్షలు జమ
- జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
చిరు వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న తోడు పథకం వరంలాంటిదని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ తెలిపారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు 7 విడతలో 5,10,412 మందికి వడ్డీ లేని రూ.549.70 కోట్ల రుణాలు, గతంలో ఈ పథకం ద్వారా రుణాలు పొంది సకాలంలో చెల్లించిన వారికి రూ. 11.03 కోట్ల వడ్డీ మొత్తాన్ని కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాలకు జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా నంద్యాల కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్, మైనారిటీ సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా, ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శశికళారెడ్డి, హస్తకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, డిఆర్డిఏ పీడి శ్రీధర్ రెడ్డి, మెప్మా పీడీ శోభ, ఎల్డిఎం రవీంద్ర తదితరులు వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జగనన్న తోడు పధకం కింద చిరు వ్యాపారులు రుణాలు పొంది సకాలంలో చెల్లించిన 17,691 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయంబర్స్మెంట్ కింద రూ.45.90 లక్షలు జమ చేసినట్లు తెలిపారు. అలాగే ఈ ఏడాది డిసెంబర్ వరకు గుర్తించిన 18,274 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ. 19.68 కోట్ల మొత్తాన్ని జమ చేయనున్నా మన్నారు. ఇంకా ఏవరైనా అర్హత ఉండి కూడా పథకం అందకపోతే వారికి కూడా లబ్ధి చేకూరుస్తామన్నారు. జగనన్న తోడు పథకం చిరు వ్యాపారులకు పెట్టుబడితో పాటు జీవనోపాధికి ఉపయోగపడుతోందన్నారు. జిల్లాలో జగనన్న తోడు వడ్డీ రీయంబర్స్మెంట్ కింద ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 2793 మందికి రూ.7.24 లక్షలు, బనగానపల్లిలో 2398 మందికి రూ.6.22 లక్షలు, డోన్‌లో 2803 మందికి రూ.7.27 లక్షలు, నందికొట్కూర్‌లో 2654 మందికి రూ.6.88 లక్షలు, నంద్యాలలో 3980 మందికి రూ.10.32 లక్షలు, పాణ్యంలో 765 మందికి రూ.1.98 లక్షలు, శ్రీశైలంలో 2298 మందికి రూ.5.96 లక్షలు నేరుగా జమ చేశామన్నారు. ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తోన్న జగనన్న తోడు ఆర్థిక సహాయాన్ని చిరు వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం వారు లబ్ధిదారులకు మెగా చెక్కును అందజేశారు.










