కడప : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'జగనన్న తోడు' . చిరు వ్యాపారుల ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తుందని కలెక్టర్ వి.విజరు రామరాజు పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి 7వ విడత లబ్ది మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి ప్రారంభించారు. కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ విసి హాలు నుంచి కలెక్టర్‌తోపాటు జెసి గణేష్ కుమార్, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి లు హాజరయ్యారు. ముఖ్యమంత్రి విసి ముగిసిన అనంతరం కలెక్టర్ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని 20,589 మంది చిరు వ్యాపారులకు మంజూరైన రూ.22,27,20,000లతో పాటు, 23,705 మంది మహిళలకు మంజూరైన రూ. 58,75,775 ల వడ్డీ రాయితీ మొత్తం మెగా చెక్కును గౌరవ అతిథులతో కలిసి లబ్దిదారులకు అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జగనన్న తోడు కార్యక్రమం ద్వారా పేద చిరు వ్యాపారస్తులకు ఎలాంటి వడ్డీ లేకుండా రూ.10 వేలు అందిస్తోందని చెప్పారు. ఈ రుణం సంవత్సర కాలంలో వడ్డీ లేకుండా కేవలం రూ.10 వేలు మాత్రమే తిరిగి చెల్లించేలా ప్రభుత్వం సౌలభ్యం కల్పించిందన్నారు. అర్హత ఉండి ఇంకనూ ఎవరైనా పొందలేక పోయి ఉంట సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో సంప్రదించి దరఖాస్తు చేసుకో వాలన్నారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గతంలో తన సుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది చిరువ్యాపారులు పడుతున్న ఆర్ధిక ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారి ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరిచే దిశగా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మెప్మా, డిఆర్‌డిఎ పిడిలు సురేష్ కుమార్, ఆనంద్ నాయక్, సంబందిత సంక్షేమ శాఖల అధికారులు, బ్యాంకు అధికారులు, స్వయం సహాయక సంఘ మహిళా సభ్యులు, జగనన్నతోడు లబ్ధిదారులు పాల్గొన్నారు.










