Oct 04,2023 21:16

చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

ప్రజాశక్తి - పార్వతీపురం : జిల్లాలో రెండు చిరు ధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. రెండు చిరు ధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్లకు మండలంలోని చందలంగి, పాలకొండ మండలం అట్టలిలో 50 సెంట్ల చొప్పున భూమి కేటాయించారు. ఒక్కొక్క యూనిట్‌ విలువ రూ.4.65 కోట్లు. జిల్లాలో రూ.9.30 కోట్ల విలువైన యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో యూనిట్‌లో దాదాపు 200 మందికి నేరుగా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. రైతులందరికీ మంచి లాభాలు వచ్చేలా చిరు ధాన్యాలను యూనిట్లు కొనుగోలు చేస్తాయి. మిల్లెట్‌ పౌడర్‌, మిల్లెట్‌ మాల్ట్‌, మిల్లెట్‌ ముద్దలు, మిల్లెట్‌ బిస్కెట్స్‌, మిల్లెట్‌ జావా, మిల్లెట్‌ ఇడ్లి, మిల్లెట్‌ దోసలు వేసే పౌడర్‌ తదితర విధాలా ఉపయోగించే ఉత్పాదకాలను తయారీకి అనువైన పదార్ధాన్ని ఇక్కడ తయారు చేస్తారు.
అనంతరం కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో చిరు ధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్లు రావడం ముదావహం అన్నారు. జిల్లాలో చోడి పంటను 3116 ఎకరాల్లో, కొర్ర పంటను 375 ఎకరాల్లో, సామ పంటను 551 ఎకరాల్లో, జొన్న పంటను 241 ఎకరాల్లో, గంటెలు 86 ఎకరాల్లో 3640 మంది రైతులు పండిస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంలో భాగంగా రైతులను ప్రోత్సహిస్తున్నా మని, అధిక దిగుబడులిచ్చే విత్తనాలు ఇస్తున్నామని, చిరు ధాన్యాల ప్రాధాన్యత తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా స్థానికంగా యూనిట్ల శిలా ఫలకాలను జిల్లా కలెక్టర్‌ లాంఛనంగా ఆవిష్కరించారు. వర్చువల్‌ విధానంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కార్యనిర్వాహక అధికారి కె. సత్యనారాయణ రెడ్డి, వెలుగు ఎపిడి వై.సత్యం నాయుడు, రెండు గ్రామాల సర్పంచులు, చిరు ధాన్యాలను పండించే రైతులు పాల్గొన్నారు.