ప్రజాశక్తి పాడేరు:చిరు ధాన్యాల్లో మెండైన పోషక విలువలు ఉన్నాయని ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాలకృష్ణ తెలిపారు. శుక్రవారం ప్రపంచ చిరు ధాన్యాల మహౌత్సవాన్ని పురష్కరించుకొని స్థానిక కాఫీ హౌస్‌లో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల వంటల ప్రదర్శనను జేసి, సబ్ కలెక్టర్లతో తిలకించి చిరు ధాన్యాలతో చేసిన వంటకాలు రుచి చూసారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాల స్వయం సహాయక బృందాలు చిరు దాన్యాలతో తయారు చేసిన సుమారు 55 రకాల వంటకాలు ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సును ఉద్దేశించి పిఒ మాట్లాడుతూ, ప్రతి మండలంలో కనీసం వంద కొత్త సంఘాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అర్హత గల సంఘ సభ్యురాలు రుణాలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యం పట్ల స్త్రీ శ్రద్ధ వహిస్తే కుటుంభం అంతటికీ ఆరోగ్యం లభిస్తుందని, దీంతో ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందని వివరించారు. గిరిజన ప్రాంతాలలో సాంప్రదాయ పద్ధతిలో పండించే చిరు ధాన్యాలలో పోషక విలువలు ఎక్కువగా ఉన్నందున మహిళా సంఘాల ప్రతినిధులు ప్రతి సమావేశంలో చిరు ధాన్యాలు, ఆరోగ్యంపై చర్చించాలని కోరారు.జిల్లాలో రక్త హీనత, సికిల్‌సెల్ అనీమియా, తలసేమియా వంటి వ్యాధులు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలన్నారు. చిరు ధాన్యాల వ్యాపారం కోసం విశాఖపట్నంలో స్థలం అడిగామని, 40 నుండి 50 ఆదివాసీ రైతు అవుట్ లెట్లు ఏర్పాటు చేసి చిరు ధాన్యాల రైతుల లబ్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
సంయుక్త కలక్టర్ జే.శివ శ్రీనివాసు మాట్లాడుతూ, రానున్న కాలంలో చిరుదాన్యాలకే అధిక ప్రాదాన్యముందన్నారు. గిరిజనులు చిరు ధాన్యాల సాగును విస్తరించాలని సూచించారు. జిల్లాలో రక్త హీనత అధికంగా ఉన్నందున గ్రామ స్థాయి సమావేశాలలో ఆరోగ్యం, చిరు ధాన్యాల వాడకంపై విస్తతంగా చర్చించాలని సూచించారు. ప్రభుత్వం కూడా ఇటీవల చిరుదాన్యమైన రాగి జావను పాఠశాల విద్యార్ధులకు అందిస్తోందని, రేషన్ షాపులలో కూడా బియ్యం బదులు చిరు ధాన్యాలు అందించే దిశగా చర్యలు తీసుకుందని తెలిపారు. సబ్ కలక్టర్ వి. అభిషేక్, జిల్లా వ్యవసాయాదికారి బిఎస్‌ఎస్ నంద్, డిఆర్డిఎ పిడి మురళి తదితరులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎల్‌డిఎం రవి తేజ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సిహెచ్. దేవి, 22 మండలాల సమాఖ్య అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.










