సఖీ !
చూపుల విరితూపులతో
నాహృదివీణలో
వలపురాగాలు పలికించిన
నీ వాలుచూపుల కలువల్లో
తుమ్మెదనై నే వాలనా !
నా జీవితంలో ఎదురుపడ్డ
నీ పాదాలకు పరుపునై
మనసునిండా నిన్నేమోసే
గడ్డిపూవునే కానా
పాలనురుగుతో నీ పాదాలు తాకే
సాగరకెరటం నే కానా!
నీలిమేఘాలు మురిసి
నునులేత గాలులు వింజామరలై
నీ ముంగురులు సవరించగ
పులకరించి పురివిప్పిన
నీ అధర దరహాసంలో
వెన్నెలకిరణమై తళుకులీననా!
నా ఎద సవ్వడిలో నీ ధ్యానమే
నా భావపరంపరలో నీ నామమే
నీవు నా చెంతనుంటే
నా చింతలన్నీ దూరమే
అందుకే చిగురాకు నీవై
నీపై వాలిన తుషార బిందువు
నే కానా!
వెన్నెలను మించిన అందంతో
పున్నమిని మరిచేలా చేస్తున్న నీకై
కిరణ స్పర్శకోసం తపిస్తూ
ప్రతీ ఉదయం ఆకాశం వంక
ఆశగా ఎదురుచూసే సరోజంలా
ఎదురుచూస్తూనే ఉంటా
నేనో చీకటిశకలమై
నీ ఎడబాటు నింగినుంచి
రాలిపోక ముందే
శిశిరాలు చిగిర్చే నీ పాదముద్రల్ని
నా మదిమన్నుపై
గాఢంగా అద్దుతావు కదూ !
- వేమూరి శ్రీనివాస్
9912128967